టీఆర్ఎస్ ఎంపీకి కేసీఆర్ షాక్‌ … నిరాశలో గుత్తా

ఎన్నో ఆశ‌ల‌తో సొంత పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన నేత‌ల‌కు వ‌రుస‌గా షాక్‌లు త‌గులుతున్నాయి. ఏదో ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని.. గులాబీ కండువా క‌ప్పుకున్న నాయ‌కుల‌కు.. చివ‌రికి నిరాశే ఎదుర‌వుతోంది! ఇప్ప‌టికే కారులో ఇమ‌డ‌లేక‌.. సొంత గూటికి వెళ్ల‌లేక ఇలాంటి నాయ‌కులంతా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇప్పుడు ఇదే జాబితాలో మ‌రో ఎంపీ కూడా చేరిపోయారు. మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని ఆయ‌న పెట్టుకున్న ఆశ‌లు అడియాశ‌ల‌య్యాయి! దీంతో ఆయ‌న తీవ్రంగా మ‌థ‌న‌ప‌డుతున్నారని స‌మాచారం! మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని వ‌చ్చిన ఆయ‌న‌కు నిరాశే ఎదుర‌వ‌డంతో.. భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ఏంట‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

న‌ల్గొండ‌ ఎంపీ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి.. మినిస్ట‌ర్ క‌ల.. క‌ల‌గానే మిగిలిపోనుంద‌నే వార్త ఆయ‌న వ‌ర్గంలో తీవ్ర అసంతృప్తి రేకెత్తిస్తోంది. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై జోరుగా క‌థ‌నాలు వినిపిస్తున్న త‌రుణంలో ఆయ‌న పేరు కూడా ఇందులో ఉంటుంద‌ని ఆయ‌న ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ ఆయ‌న‌కు మొండిచెయ్యే ఎదుర‌య్యే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. కాంగ్రెస్ లో ఉన్న స‌మ‌యంలో టీఆర్ఎస్‌, కేసీఆర్‌పై తీవ్రంగా విమ‌ర్శ‌లు చేశారు. త‌ర్వాత గులాబీ కండువా క‌ప్పుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. అయితే ఆసమ‌యంలో మంత్రి ప‌ద‌వి హామీతోనే ఆయ‌న పార్టీలో చేరార‌నే విమ‌ర్శ‌లు కూడా వినిపించాయి.

అయితే ఇంత‌కాల‌మవుతున్నా.. మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌రుగుతుంద‌న్న ప్ర‌తిసారీ ఆయ‌న పేరు మాత్రం ఎక్క‌డా వినిపించక‌పోవ‌డంతో ఒకింత అసంతృప్తికి లోన‌య్యార‌ట‌. క‌డియం శ్రీ‌హ‌రి ఎంపీగా ఉండ‌గానే, ఆయ‌న‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. త‌న‌కూ అలాగే మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని ఆశాభావంతో ఉన్నార‌ట‌. కాగా, ఆయ‌న‌కు మంత్రి  ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డానికి ప్ర‌త్యేక కార‌ణం ఉంద‌ని  టీర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యంగా గుత్తా సుఖేందర్ రెడ్డి న‌ల్గొండ ఎంపీ కావ‌డంతో.. ఇప్పుడు ఆయ‌న‌తో రాజీనామా చేయిస్తే..అక్క‌డ ఉప ఎన్నిక నిర్వ‌హించాలి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పెద్ద‌లంతా అదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. దీంతో అప్పుడు జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో రిజ‌ల్ట్ పార్టీకి అనుకూలంగా రాక‌పోతే.. అది టీఆర్ఎస్‌కు పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. అందుకే గుత్తాకు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం లేద‌ని చెబుతున్నాయి.