టీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యే మ‌ధ్య ” మంత్రి ” చిచ్చు

టీఆర్ఎస్ పార్టీలోని విభేదాలు సీఎం కేసీఆర్‌కు త‌ల‌నొప్పిగా మారుతున్నాయి. మంత్రి ప‌ద‌వి విష‌యంలో తెలంగాణ ఎంపీ, ఎమ్మెల్యే మ‌ధ్య వివాదం రాజుకుంది. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర విమ‌ర్శ‌లు చేసుకునే వ‌ర‌కూ వెళ్లింది. స‌వాళ్లు, ప్ర‌తిస‌వాళ్లు విసురుకునే స్థాయికి చేరుకుంది. చాలెంజ్‌లు చేసుకున్నారు కూడా! మీడియా ముఖంగా ఉద‌యం.. తీవ్రంగా విమ‌ర్శ‌లు చేసుకున్న వారే.. సాయంత్రం ఇద్ద‌రూ క‌లిసి ఒకే వేదిక‌ను పంచుకున్నారు. త‌మ మ‌ధ్య విభేదాలు లేవంటూనే మ‌రోసారి విమ‌ర్శించుకున్నారు. దీంతో ఆశ్చ‌ర్య పోవ‌డం టీఆర్ఎస్ నాయ‌కులు, ప్ర‌జ‌ల‌ వంత‌యింది.

ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మె ల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌ల మధ్య విభేదాలు మరోసారి భ‌గ్గుమ‌న్నాయి. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డానికి ఎంపీ జితేంద‌ర్ రెడ్డి కార‌ణ‌మ‌ని.. శ్రీ‌నివాస్ గౌడ్ ఆగ్రహం వ్య‌క్తంచేయ‌డం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొన్ని రోజులుగా వీరి మ‌ధ్య నివురు గ‌ప్పిన నిప్పులా ఉన్న విభేదాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. తమ మధ్య విభేదాలు లేవంటూనే ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు.

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా జితేందర్‌రెడ్డి ఆదివారం మాట్లాడారు. అక్కడ ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్‌ కూడా ఉన్నారు. మొదట జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, మీడియా కావాలని లేనిపోని కథనాలు సృష్టిస్తోందని ఆరోపించారు. శ్రీనివాస్‌గౌడ్‌కు మంత్రి పదవి రాకుండా తాను అడ్డుకున్నట్లు ప్రచారం చేయడం తగదన్నారు. తర్వాత మైక్ అందుకున్న‌ శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తనకు మంత్రి పదవి రాకుండా మీరే అడ్డుకున్నారని..ఆ విషయాన్ని ఓ మంత్రి చెప్పారని వ్యాఖ్యానించారు. దీనిపై జితేంద‌ర్ రెడ్డి ఫైర్ అయ్యారు.

మంత్రి పదవిని తాను అడ్డుకున్నట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేయడంతో పాటు రాజకీయాల నుంచే తప్పుకుంటానని జితేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. అయినా, మంత్రి పదవి అనేది తలరాత ఉంటేనే దక్కుతుందని.. ఎవరో అడ్డుపడితే ఆగేది కాదన్నారు. ‘ఏ మంత్రి చెప్పాడో అతన్ని సీఎం దగ్గరికి తీసుకెళ్దాం. నేను అడ్డుపడ్డట్లు నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేసి.. రాజకీయాల నుంచే తప్పుకుంటా’ అని సవాల్‌ చేశారు. ఇరువురి మధ్య వేడి రగులుతుండటంతో పార్టీ నేతలు జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో విషయం సద్దుమణిగింది. మ‌రి ఇప్పుడు ఈ వివాదం ఎలాంటా మ‌లుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే!!