టీఆర్ఎస్ తో పొత్తు పై కేంద్రం క్లారిటీ ఇచ్చిందా..!

అధికార టీఆర్ఎస్‌తో కలిసి అడుగులేయాలా?  లేక పాత ప‌ద్ధ‌తిలోనే టీడీపీతో జ‌త‌క‌ట్టాలా? అనే సందిగ్ధ‌ ప‌రిస్థితి తెలంగాణ బీజేపీ నాయ‌కుల్లో నెల‌కొంది. ఒక‌ప‌క్క సీఎం కేసీఆర్‌.. ప్ర‌ధాని మోడీతో స‌న్నిహితంగా మెలుగుతున్నారు. మరోప‌క్క కేసీఆర్ వైఫల్యాల‌ను ఎండ‌గ‌ట్టేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధ‌మ‌వుతోంది. మ‌రి ఇలాంటి విభిన్న ప‌రిస్థితుల్లోనే బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా.. తెలంగాణ‌లో ప‌ర్యట‌న హీట్ పెంచుతోంది. దీంతో టీఆర్ఎస్‌-బీజేపీ పొత్తు పేచీ ఏ స్థాయికి చేరుతుందోననే సందేహం బీజేపీ నాయ‌కుల్లో వ్య‌క్త‌మవుతోంది.

టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలతో కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీలో గందరగోళం నెలకొంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర నాయకత్వం మాత్రం పెదవి విప్పడంలేదు. వివిధ సమీకరణాల నేపథ్యంలో టీఆర్ ఎస్ తో పొత్తు ఉన్నట్లో లేనట్లో ఇప్పటి నుండే భావించవద్దని పార్టీ పరంగా ప్రజా సమస్యలపై పోరు కొనసాగించాలని కేంద్ర నాయకత్వం రాష్ట్ర కమిటీని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మద్యం అమ్మకాలపై-స్కాలర్ షిప్స్-విద్యా విధానాలపై పెద్ద ఎత్తున బీజేపీ ఉద్య‌మాలు ఆందోళన కార్యక్రమాలను చేపట్టింది.

అదే సమయంలో మిత్రపక్షమైన టీడీపీ విషయంలోనూ ఆ పార్టీ తేల్చుకోలేక పోతోంది. ఇటీవల రెండు రోజులపాటు భద్రాచలంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశాలలోనూ బీజేపీ శ్రేణులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపర్చారు. మరోవైపు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా త్వరలో తెలంగాణలో పర్యటించనున్నారనే వార్తతో పార్టీ ఏ విధంగా ముందుకు సాగాలనే ప్రశ్న కొనసాగుతోంది.

వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బూత్ స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కేంద్ర నాయకత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక 16పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ నేతలు నిర్ణయించిన‌ట్టు స‌మాచారం,