టీఆర్ఎస్-బీజేపీ పొత్తుపై కొత్త పేచీ

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బ‌ల‌మైన జాతీయ పార్టీగా అవ‌త‌రించాల‌ని పెద్ద ఎత్తున ప్ర‌ణాళికలు సిద్ధం చేసుకుంటున్న బీజేపీకి స‌రికొత్త స‌మ‌స్య‌లు అడ్డువ‌స్తున్నాయి! 2014లో ఏపీలో చంద్ర‌బాబు పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని నాలుగు స్థానాలు కైవ‌సం చేసుకుంది. అదేవిధంగా మంత్రివ‌ర్గంలో రెండు సీట్ల‌ను సైతం కొట్టేసింది బీజేపీ. ఇక‌, ఇదే త‌ర‌హాలో తెలంగాణ‌లోనూ అధికార కేసీఆర్‌తో చెలిమి చేయ‌డం ద్వారా లాభ‌ప‌డాల‌నేది క‌మ‌ల నాథుల వ్యూహంగా క‌నిపిస్తోంది. అయితే, కొంద‌రు మాత్రం ఏపీ మాదిరిగా టీడీపీతో పొత్తు పెట్టుకుందామ‌ని సూచిస్తున్నారు. అయితే, దీనిపై ఎలాంటి స్ప‌ష్ట‌తా రాలేదు.

నిజానికి ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోతే.. త్వ‌రిత‌గ‌తిన ల‌బ్ధి పొందాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన పార్టీ బీజేపీ. కానీ, అనూహ్యంగా ఎదురు దెబ్బ‌త‌గ‌లింది. గ‌తానికి ఇప్ప‌టికి పెద్ద మార్పు క‌నిపించ‌డం లేదు. దీంతో 2019లోనైనా రెండంకెల స్థాయిలో అసెంబ్లీ స్థానాలు ద‌క్కించుకోవాలంటే.. ప్రాంతీయంగా బ‌లంగా ఉన్న పార్టీల‌తో పొత్తు త‌ప్ప‌ద‌ని భావించింది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ‌లో కేసీఆర్ చేయి ప‌ట్టుకుని ఎన్నిక‌ల గ‌ట్టు దాటాల‌ని నిర్ణ‌యించింది. అయితే, దీనిపై ఇంకా నిర్ణ‌యం తీసుకోలేదు. ఈ క్ర‌మంలోనే పొత్తుల‌పై ఇంకా ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని, అధికార పార్టీపై విమ‌ర్శ‌ల బాణాలు సంధిస్తూనే ఉండాల‌ని అధిష్టానం రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు స‌మాచారం పంపింది.

దీంతో  బీజేపీ రాష్ట్ర నేత‌లు.. త‌మ త‌మ స్టైళ్ల‌లో టీఆర్ ఎస్ పాల‌న‌పై విరుచుకుప‌డుతున్నారు. మద్యం అమ్మకాలపైనా – స్కాలర్ షిప్ లు – విద్యాసమస్యలపైనా పెద్ద ఎత్తున బీజేపీ ఉద్యమాలు చేశారు. అంతేకాకుండా  వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బూత్ స్థాయిలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కేంద్ర నాయకత్వం ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న కీలక 16 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ప్ర‌స్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నిక‌లు ఉండ‌డంతో ఇవి ముగిసిన త‌ర్వాత తెలంగాణ‌పై దృష్టి పెట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది.