టీఆర్ఎస్ లేడీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి

తెలంగాణ అధికార పార్టీలో నేత‌ల మ‌ధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. గ‌త కొన్నాళ్లుగా నేత‌ల మ‌ధ్య ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌డం లేద‌నే టాక్ వ‌స్తోంది. ఎవ‌రి ఆధిప‌త్య ధోర‌ణిని వారు ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం వ‌ల్లే.. ఈ ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మ‌వుతోంద‌ని తెలుస్తోంది. అయితే, ఇది మ‌రింత ముదిరితే ప‌రిస్తితి ఏంట‌నేది ప్ర‌శ్న‌. తాజాగా జ‌రిగిన ఓ ఘ‌ట‌న.. ఓ మ‌హిళా ఎమ్మెల్యే, ఓ మంత్రిని మీడియాకు ఎక్కేలా చేసింది. పాత ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రి జోగు రామ‌న్న‌, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖ నాయ‌క్‌ల మ‌ధ్య ఇప్పుడు ఉప్పు నిప్పు ప‌రిస్థితి ఉంద‌ని తెలుస్తోంది.

అసెంబ్లీ ఛైల్డ్‌ అండ్‌ ఉమెన్స్‌ వెల్ఫేర్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్న రేఖా నాయక్… ఆ హోదాలో ఉమెన్‌ వెల్ఫేర్‌ సంబంధిత శాఖ అధికారులతో రివ్యూలు నిర్వహించారట. రాష్ట్ర స్థాయి అధికారులతోనే కాకుండా… ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఐసీడీఎస్‌ అధికారులతో కూడా సమావేశాలు పెట్టారట. దీంతో మంత్రిగా ఉన్న తనకు తెలియకుండా రేఖా నాయక్ ఇలా వ్యవహరించడాన్ని మనసులో పెట్టుకున్న మంత్రి జోగు రామన్న… ఎలాగైనా స‌రే త‌న ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలోనే కీలక శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఎమ్మెల్యే భర్త శ్యామ్‌ నాయక్‌ను ఆదిలాబాద్ నుంచి జనగామకు బదిలీ చేయించారట. ఈ ప‌రిణామంతో ఒక్క‌సారిగా ఉల‌క్కిప‌డ్డ ఎమ్మెల్యే రేఖ‌.. పార్టీ పెద్దలను కలిసి ఫిర్యాదు చేయాల‌ని ప్ర‌య‌త్నించినా ప్రయోజనం లేకపోవడంతో… ఆమె అసంతృప్తితో రగలిపోతున్నారట. మొత్తానికి టీఆర్ఎస్ మంత్రి, ఎమ్మెల్యే మధ్య ముదురుతున్న వైరం… పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.