టీడీపీకి షాక్ ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ

అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిన సందర్భంగా పార్టీ-ప్రభుత్వంపై జనాభిప్రాయం సేకరించేందుకు తెలుగు దేశం పార్టీ రంగంలోకి దిగింది.పబ్లిక్ ఒపినీయన్ లో 25-30 మంది ఎమ్మెల్యేలపై మాత్రం సదభిప్రాయం వ్యక్తమయినట్లు సమాచారం. సగానికిపైగా ఎమ్మెల్యేలు, కొందరు మంత్రుల కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని పరిసర జిల్లాల్లోని ఇద్దరు మంత్రుల భార్యలు కౌంటర్లు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక శాఖ అడ్వర్టైజ్‌మెంట్‌కు సంబంధించి ఏమైనా పనులు కావాలంటే సదరు మంత్రి సతీమణిని సంప్రదించాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది. అందులో దాదాపు 200 కోట్లు బడ్జెట్ ఉందంటున్నారు. నిజానికి నిధులు లేక విలవిల్లాడుతున్న సమాచారశాఖకు అలాంటి శాఖల నుంచి నిధులు మళ్లిస్తే, ప్రభుత్వానికి బోలెడంత ప్రచారం కూడా వస్తుందంటున్నారు.మంత్రి భార్య ఇటీవల మైనింగ్ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్‌షాపుల నుంచి ఆ శాఖ బదిలీల వరకూ పెత్తనం చెలాయించిన ఆమె, ఈ మధ్య కాలంలో మైనింగ్ వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఆ నియోజకవర్గ పరిథిలో ఉన్న 14 క్వారీలను నిలిపివేయించిన ఫలితంగా తమ ఆదాయం దెబ్బతిన్నదని, పార్టీ అధికారంలోకి వస్తే లాభం ఉంటుందనుకుని సొంత డబ్బు పెట్టిన సొంత సామాజికవర్గానికి చెందిన వారే, ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి ఏం లాభమని వాపోతున్నారు.

పదిరోజుల నుంచి పార్టీ నెంబరు ఫోన్ల నుంచి వివిధ వర్గాల ప్రజల సెల్‌ఫోన్లకు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశ్నలు వస్తున్నాయి.ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల పనితీరు, అందుబాటులో ఉంటున్న వైనం, అవినీతి గురించి కూడా ప్రశ్నిస్తోంది. దానితోపాటు ఒకవేళ ఇప్పుడున్న ఎమ్మెల్యే కాకపోతే మరొకరిని సూచించమని కూడా అడుగుతోంది. చాలామంది తమకు వచ్చిన నెంబర్లు చూసి తిరిగి ఆ నెంబర్లకు ఫోన్ చేస్తుంటే, తెలుగుదేశం పార్టీ పేరు వస్తోంది. వీటికిమించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే ఎవరికి ఓటు వేస్తారు? గత ఎన్నికల్లో ఎవరికి ఓటు వేశారన్న ప్రశ్నలు అడుగుతుండటం ఆసక్తికలిగిస్తోంది.

ప్రజల్లో ప్రభుత్వ పరిపాలనపై సానుకూలత ఉన్నప్పటికీ, ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం అసంతృప్తి వ్యక్తమవుతోందని  సర్వేల్లో వెల్లడయింది. ప్రభుత్వ సానుకూలత పార్టీకి అక్కరకు రావడం లేదని, అదే పరిస్థితి కొనసాగితే ఎన్నికల్లో పార్టీ దెబ్బతింటుందన్న ఆందోళన పార్టీలో కొనసాగుతోంది. ఎమ్మెల్యేలపై సానుకూలత లేని వారిని వచ్చే ఎన్నికల్లో తప్పించడమో, లేదా వారి పనితీరు మార్చుకునేందుకు గడువు ఇవ్వడమో చేయాలన్నది పార్టీ నాయకత్వం ఆలోచనగా ఉంది. పెన్షన్లపై అన్ని వర్గాల్లో సానుకూలత ఉన్నప్పటికీ అది ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోగా, నిరక్షరాస్యుల్లో వెయ్యి రూపాయలకు పెంచిన ఆ పెన్షన్లు ఇంకా రాజశేఖరరెడ్డి ఇస్తున్నారన్న భావన నెలకొంది. ఇవన్నీ గమనించిన తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు పార్టీ మరింత ప్రాధాన్యం ఇస్తోంది.

ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబసభ్యుల అవినీతి వల్ల నియోజకవర్గాల్లో పార్టీ భ్రష్ఠుపట్టిపోయే ప్రమాదం ఏర్పడిందని, కొన్ని నియోజకవర్గాల్లో సొంత పార్టీ వారి నుంచే డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులున్నాయి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం కొందరు మాత్రమే లబ్ధిపొందుతున్నారని, కానీ పేరు మాత్రం మొత్తం కులానికి వస్తోందని మరికొందరు వాపోతున్నారు. అయితే కృష్ణా జిల్లాలో ఇదే సామాజికవర్గం ప్రదర్శిస్తున్న దూకుడు మిగిలిన వర్గాలకు పార్టీని దూరం చేసేలా ఉందంటున్నారు. సర్వేల వల్ల ఇలాంటి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునే అవకాశం రావడం నాయకత్వానికీ మంచిదేనని పార్టీ శ్రేణులు సంతోషిస్తున్నారు.