టీడీపీకీ, సీపీఎంకీ మధ్య వ్యత్యాసమిదే..

క్ర‌మశిక్ష‌ణ‌కు మారుపేరైన సీఎం చంద్ర‌బాబుకు సొంత పార్టీ నేత‌లే షాక్ ఇచ్చారు. ఎంపీ, ఎమ్మెల్యే తమ అధికార ఆధిప‌త్యాన్ని చూపించారు. అయితే ఇలా చేసినందుకు కేవ‌లం సారీతో స‌రిపెట్టారు. కానీ ఇదే త‌రహా సంఘ‌ట‌న కేర‌ళ‌లో ఎదురైంది. దీంతో ఏకంగా మంత్రినే ప‌ద‌వి నుంచే పీకేశారు! ప‌క్కా సాక్ష్యాలు ఉన్నా కేవ‌లం సారీ చెబితే ఇక వివాదం స‌ద్దుమ‌ణిగింద‌ని.. అంతా సైలెంట్ అయిపోయారు. కేర‌ళ‌లో మాత్రం అంతా రివ‌ర్స్‌లో జ‌రగ‌డం గ‌మ‌నార్హం!! త‌ప్పు చేస్తే ఎంత‌వారినైనా ఉపేక్షించేది లేద‌ని కేర‌ళ‌లో స్ప‌ష్టంచేస్తే.. మ‌రి ఇక్క‌డ ఏం జ‌రిగిందో అంద‌రికీ తెలిసిందే!

ఎవరు అవునన్నా.. కాదన్నా మీడియా కారణంగా చాలానే విషయాలు బయటకు వస్తున్నాయి. అధికారంలో ఎవరున్నా.. మీడియాలో ప్రముఖంగా వచ్చే అంశాలపై మనసులో ఎలా ఉన్నా.. ప్రజాగ్రహానికి గురికాకుండా ఉండేలా నిర్ణయాలు తప్పనిసరి. సీనియర్ ఐపీఎస్ అధికారిపై అధికార పక్ష ఎంపీ.. ఎమ్మెల్యేలు దురుసుగా వ్యవహరించటం..  తర్వాత‌ జరిగిన దానికి సారీ చెబుతూ.. లెంపలేసుకున్న వైనాన్నిమర్చిపోకూడదు. ఏపీలో కాబట్టి మాటలు.. సారీలతో బండి నడిచిపోతుంది. కానీ.. కేరళలో అలా కాదు.. మాట జారిన మంత్రిపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేరళలోని సీపీఎం నేతృత్వంలోని ప్రభుత్వం.. తమ నేతలపై వచ్చే ఆరోపణల విషయంలో చాలా సీరియస్ గా ఉంటుంది.

తాజాగా 72 ఏళ్ల ముసలి మంత్రి ఏకే శశీంద్రన్ పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళతో ఆయన అశ్లీలంగా మాట్లాడినట్లుగా వార్తలు వినిపించాయి. మంత్రిగారి మాటల్ని అక్కడి `మంగళమ్` అనే ఛానల్ టెలికాస్ట్ చేసింది.అంతే.. వెనువెంటనే చోటు చేసుకున్న పరిణమాలతో మంత్రిగారి వికెట్ పడిపోయింది. మరింత.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ వృద్ధమంత్రిపై ఆదివారం ఉదయం ఆరోపణలు వస్తే.. సాయంత్రం నాటికి మంత్రి తన పదవికి రాజీనామా చేసేశారు.

అలా అని.. ఆ మంత్రిగారి ట్రాక్ రికార్డేమీ తక్కువ కాదు.. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సత్తా ఆయన సొంతం. అయినా.. తప్పు చేసిన వెంటనే.. వారిపై వేటు వేసిన వైనాన్ని చూసినప్పుడు.. ఏపీలో తన నేతల మీద ఏ తరహా చర్యలు  తీసుకోవాలో బాబు ఆలోచించుకుంటే మంచిది. ప్రతి విషయాన్నదేశంలో తాను తప్పించి ఎవరూ చేయలేరన్నట్లుగా చెప్పే చంద్రబాబు..కేరళ ప్రభుత్వం వ్యవహరించిన రీతిలో చేయగలరా? అనేది విశ్లేష‌కుల ప్ర‌శ్న‌!!