టీడీపీ మంత్రికి ఇంత చెత్త బుద్ధి ఏంటి

టీడీపీకి చెందిన కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై మొద‌టి నుంచి ప్ర‌క‌ట‌న‌లు చేస్తూనే ఉన్నారు. హోదాపై ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ త్వ‌ర‌లోనే సానుకూల ప్ర‌క‌ట‌న చేస్తార‌ని, ఏపీకి మంచే జరుగుతుంద‌ని ఆయ‌న చెబుతూవ‌చ్చారు. అయితే, అనూహ్యంగా ఏపీకి హోదా స్థానంలో ప్ర‌త్యేక ప్యాకేజీకే కేంద్రం ప‌రిమితం అయింది. దీనిపై ఏపీలోని ప్ర‌ధాని విప‌క్షం వైకాపా స‌హా కాంగ్రెస్‌, జ‌న‌సేన పార్టీలు పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్నాయి. హోదా కావాల్సిందేన‌ని మొన్న‌టికి మొన్న జ‌న‌సేనాని ప‌వ‌న్ అనంత‌ప‌రం స‌భ‌లోనూ డిమాండ్ చేశారు. ఇక‌, వైకాపా అధినేత ఈ హోదా విష‌యంపై యువ భేరి పేరుతో ఊరూరా తిరిగి యువ‌త‌కు భారీస్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.

ప‌రిస్థితి ఇలా ఉంటే.. తాజాగా ప్ర‌త్యేక హోదా అంశంపై మ‌రోసారి స్పందించారు కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి. బుధ‌వారం నుంచి ప్రారంభం అయిన పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాల్లో టీడీపీ ఎంపీలు, మంత్రులు ఎలా వ్య‌వ‌హ‌రించాల‌నే అంశంపై జ‌రిగిన చ‌ర్చ‌లో ఆయ‌న పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా సుజ‌నా మీడియాతో మాట్లాడారు. హోదా కోసం విప‌క్షాలు చేస్తున్న విమ‌ర్శ‌లు, ఆందోళ‌న‌ల‌ను ఆయ‌న తిప్పికొట్టారు. ఇవ‌న్నీ వేస్ట్ అన్నారు. అన్నీ ఆలోచించే తాము ప్యాకేజీని తీసుకున్నామ‌ని చెప్పిన మంత్రి అంత‌టితో ఆగ‌కుండా ప్ర‌స్తుతం మోడీ ప్ర‌క‌ట‌న‌తో చిత్తుకాగితాలుగా మారిపోయిన రూ.500, రూ.1000 నోట్ల‌తో హోదా అంశాన్ని ముడిపెట్టి మాట్లాడారు.

ప్ర‌త్యేక హోదా గురించి ఇప్పుడు జ‌రుగుతున్న‌ది అన‌వ‌స‌ర రాద్ధాంతం అన్నారు. కొంద‌రు కావాల‌నే ప్ర‌జ‌ల‌ను త‌ప్పు తోవ ప‌ట్టిస్తున్నారు అన్నారు. ప్ర‌త్యేక హోదా అనేది చెల్ల‌ని రూ. 500, రూ. 1000 నోటుతో స‌మాన‌మ‌ని అన్నారు! మ‌రో రెండు నెల‌ల త‌రువాత పాత నోట్లు ప‌నికిరావ‌నీ, అలాగే ప్ర‌త్యేక హోదా కూడా అనీ, ప్ర‌స్తుతం రాష్ట్రానికి ఏది అవ‌స‌ర‌మో అదే మాట్లాడాల‌ని ఆయ‌న అన్నారు. వాస్త‌వానికి ప్ర‌త్యేక హోదాతో ఏపీకి ఎంతో ల‌బ్ధి చేకూరుతుంద‌ని ప్ర‌క‌టించిన సుజ‌నా చౌద‌రి ఇప్పుడు హ‌ఠాత్తుగా ఇలా చిత్తు కాగితంతో పోల్చ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బ‌ని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. మ‌రి ఈ చెత్త మాట‌లేంటో ఆ మంత్రిగారే సెల‌వివ్వాలి. మొత్తానికి మంత్రి గారు త‌న చెత్త బుద్ధిని బ‌య‌ట పెట్టుకున్నార‌ని అనిపిస్తోంది.