టీ కాంగ్రెస్ లో సెగలు రేపుతోన్న పోస్టులు

2019 ఎన్నిక‌ల్లో ఎలాగైనా తెలంగాణ సీటును ద‌క్కించుకోవాల‌ని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్‌.. దానికి త‌గ్గ‌ట్టుగా వ్యూహం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్ర‌మంలో పార్టీని ముందుండి న‌డిపించేందుకు జిల్లాల అధ్య‌క్షుల‌ను నియ‌మించ‌డంపై దృష్టి పెట్టింది. వాస్త‌వానికి రాష్ట్ర విభ‌జ‌న నాటికి కేవ‌లం 10 జిల్లాలే ఉన్నాయి. అయితే, ఇప్పుడు మొత్తం 31 జిల్లాలు వ‌చ్చాయి. దీంతో దాదాపు 21 కొత్త జిల్లాల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు జిల్లా పార్టీ అధ్య‌క్షుల‌ను కాంగ్రెస్ నియ‌మించ‌లేదు. దీంతో వీరిని ఇప్ప‌టికిప్పుడు నియ‌మించి పార్టీని సంస్థాగ‌తంగా బ‌లోపేతం చేసి.. 2019 నాటికి స‌త్తా చాటాల‌ని పార్టీ వ్యూహం చేస్తోంది. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డికి ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించింది.

దీంతో రంగంలోకి దిగిన ఉత్త‌మ్ జిల్లాల‌కు అధ్య‌క్షుల‌ను నియ‌మించ‌డంపై దృష్టి పెట్టారు.అ యితే, ఆయ‌న‌కు అడుగ‌డుగునా ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి. నిజానికి డీసీసీలుగా నియ‌మితుల‌య్యేవారికి 2019 ఎన్నిక‌ల్లో టికెట్ ఇవ్వ‌ర‌ని మొన్నామ‌ధ్య ప్ర‌క‌టించ‌డంతో దాదాపు కీల‌క నేత‌లంతా వెన‌క్కి మ‌ళ్లారు. అయితే, ఇటీవ‌ల మ‌ళ్లీ.. ఈ నిర్ణయాన్ని పార్టీ స‌మీక్షిస్తుంద‌ని, ఈ నియ‌మం పెట్టుకుంటే.. పార్టీకి నేత‌లే క‌రువైపోతార‌ని భావించిన నేతలంతా త‌మ త‌మ ప‌రిధిలో ఇప్పుడు డీసీసీ పోస్టు కోసం పెద్ద ఎత్తున పోటీ ప‌డుతున్నారు. దీంతో కొత్త జిల్లాల‌కు డీసీసీల‌ను ఎంపిక చేయ‌డం ఉత్త‌మ్‌కి క‌త్తిమీద సాములా ప‌రిణ‌మించింది. నిజానికి క‌రీంన‌గ‌ర్ విష‌యంలో సొంత త‌మ్ముడి నుంచే ఉత్త‌మ్‌కి పెద్ద ప‌రీక్ష ఎదురైంద‌ని తెలుస్తోంది.

కరీంనగర్ డీసీసీని దక్కించుకునేందుకు ఆశావాహులు భారీ ఎత్తున‌ కుస్తీ పడుతున్నారు. కటకం మృత్యుంజయం స్థానంలో తనకు అవకాశం కల్పించాలని ఉత్తమ్ సోదరుడు కౌశిక్ రెడ్డి అడుగుతున్నారు. కౌశిక్ అభ్యర్థిత్వాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇప్పటికే డీసీసీగా ఉన్న మృత్యుంజయాన్నే తిరిగి కొనసాగించాలంటున్నారు. కౌశిక్ మాత్రం జిల్లాలో ఇతర ముఖ్యనేతల మద్దతు తనకే ఉందని చెప్పుకుంటున్నారు. దీంతో పొన్నం- కౌశిక్‌కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదిలా ఉంటే మాజీ ఎంపీ చొక్కారావు మనువడు నిఖిల్ చక్రవర్తి…బొమ్మ శ్రీరామ్‌లు తాము సైతం రేస్‌లో ఉన్నామంటున్నారు.

మంచిర్యాల డీసీసీ ఎంపిక కూడా ఉత్త‌మ్‌కి అగ్ని ప‌రీక్ష‌గా మారింద‌ట‌. ఇప్పటికే ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్ రావు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి మధ్య నడుస్తున్న వార్‌ పార్టీలో మరింత సెగ రేపుతోంది. ఉత్తమ్‌, భట్టి విక్రమార్కలు వారి వారి వర్గాలకు ప్రాతినిథ్యం కావాలని ప్టటుబడుతుండటంతో సీన్‌ రంజుగా మారింది. దీంతో ఈ వ్య‌వ‌హారం ఇప్పటికే ఢిల్లీ గడపకు చేరుకుందని సమాచారం. మ‌రి ఈ విష‌యంలో అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. అదేవిధంగా  భూపాలపల్లి జిల్లా అధ్యక్ష పదవి తన భార్య గండ్ర జ్యోతికి కావాలని మాజీ చీఫ్ విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అడుగుతున్నారు.

ఇక వరంగల్ అర్బన్‌లో ఎర్రబెల్లి స్వర్ణ.. దయాసాగర్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక వరంగల్ రూరల్‌లో పరకాల వెంకట్రామిరెడ్డి డీసీసీ పదవి ఆశిస్తున్నారు. మ‌రోప‌క్క‌, మహబూబ్‌బాద్‌లో డీసీసీని ఇప్పటికే పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ అనధికారికంగా ప్రకటించారు. లోకల్ నేతల నుంచి ఏకాభిప్రాయం రావడంతో డీసీసీగా భరత్ చంద్రా రెడ్డిని డిక్లేర్ చేశారు. ఇక‌,  ఖ‌మ్మంలోనూ ఇబ్బందిక‌ర ప‌రిస్థితే కొన‌సాగుతోంది. సీనియ‌ర్ నేత‌లు రేణుకాచౌదరి..భట్టి విక్రమార్క..పొంగులేటి సుధాకర్‌లు ఎవరికీ వారు తమ ఆధిపత్యం నిలుపుకునేందుకు తమ అనుచరులను డీసీసీని కట్టబెట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రస్తుతం డీసీసీగా ఉన్న ఐతం సత్యం భట్టికి అనుచరుడిగా పేరుంది. కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్‌రావు తనయుడు రాఘవ డీసీసీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి రేణుకాచౌదరి తన అనుచరుడు ఎడవెల్లి కృష్ణ కోసం ముమ్మరంగా లాబీంగ్ చేస్తున్నారు. దీంతో డీసీసీల ఎంపిక ఉత్త‌మ్‌కి ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా మారింద‌నే టాక్ వ‌స్తోంది.