టీ టీడీపీ తమ్ముళ్ల వేదన వర్ణనాతీతం

ఇప్పటికే తెలంగాణాలో టీడీపీ పార్టీ దాదాపు కనుమరుగయ్యే పరిస్థితికొచ్చింది.ఇక తాజా పరిణామాలు దానికి తోడు అధ్యక్షుల వారి మౌన వైఖరితో మిగిలిన కాస్త కూస్త క్యాడర్ కూడా చేజారిపోనుందని సమాచారం.తెలంగాణలో టిడిపికి గడ్డు రోజులు ఎదరవుతున్నాయి.రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో పార్టీని కాపాడుకునేందుకు తెలంగాణ తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికే కృష్ణా నది నీటి వివాదాలతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక రాష్ట్ర హైకోర్టును విభజించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ న్యాయవాదులు చేస్తున్న ఆందోళనలు రోజు రోజుకు ఉదృతమవుతున్నాయి. ఇక న్యాయవాదుల ఆందోళనకు మద్దతు ప్రకటించిన సిఎం కెసిఆర్ కేంద్రప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలనే కేంద్రం తెలంగాణ పట్ల వివక్షను చూపుతోందని ఆరోపిస్తూ సిఎం కెసిఆర్ దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ ముందు ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. దీనిపై చంద్రబాబు వైఖరి ప్రస్నార్ధకంగా మారడంతో టీ టీడీపీ శ్రేణులు తలలు పట్టుకున్నాయి. చేసేదేమి లేక కేంద్రమే ఇరు రాష్ట్రాల సిఎంలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని తెలంగాణ టిడిపి నేతలు మొక్కుబడి డిమాండ్ చేస్తున్నారు. ఇక రాష్ట్ర బిజెపి నేతలు మాత్రం టిఆర్ఎస్, టిడిపిలపై ఎదురుదాడి ఆరంభించారు. రెండు రాష్ట్రాల సిఎంలు కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కార మవుతుందని వాదిస్తున్నారు. కెసిఆర్ ఢిల్లీలో ఆందోళన చేసే ఆలోచనను మానుకుని అమరావతిలో ఆందోళన చేస్తే ఫలితముంటుందని ఎద్దేవా చేస్తున్నారు. ఈ పరిణామాలతో ఖంగుతిన్న టి టిడిపి నేతలు ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడ్డారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ లో పార్టీని పట్టించుకోవడం లేదని టి టిడిపి నేతలు వాపోతున్నారు. ఓటుకు నోటు కేసుకు ముందు రాష్ట్రంలో టిడిపి బలంగానే ఉండేది. ఆ కేసులో పార్టీ అగ్రనేత రేవంత్‌రెడ్డితో పాటు చంద్రబాబు పాత్ర ఉందనే విషయాలు బయటకు వచ్చాయి. ఆడియో టేపులు బహిర్గతమయిన తరువాత నారా వారు కల్వకుంట్ల వారితో రాజీపడ్డారని పుకార్లు షికార్లు చేశాయి. గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలలో టిఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటామని టిడిపి నేతలు చెప్పినప్పటికి ఫలితాలు మాత్రం తీవ్ర నిరాశను కలిగించాయి. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌ను వదిలేసిన పార్టీ ఇపుడు తన మకాంను అమరావతికి మార్చింది. మద్య మద్యలో పార్టీ నేతలు బాబును కలవాల్సి వచ్చినపుడు కూడ అమరావతి బాటే పడుతున్నారు. అక్కడ కూడ పలు సందర్బాలలో చంద్రబాబు అపాయింట్ మెంటు లభించడం లేదని తెలంగాణ నేతలు ఆరోపిస్తున్నారు. హై కోర్టు విభజన అంశం తో టి టిడిపి నేతల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఇప్పటికే వరుస వలుసలతో పార్టీ దారుణ పరాభవ స్థితిలోకి వెలుతోంది.

రాష్ట్ర హై కోర్టు విభజనతో పాటు కృష్ణానది నీటి పంపకాల విషయంలోను రెండు రాష్ట్రాల మద్య వివాదాలు ముదురుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలంగాణ మంత్రి హరీశ్‌రావుల మద్య చర్చలు కొనసాగినప్పటకి అవి కూడ అర్దాంతరంగానే ముగిశాయి. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబందించి ఎపి తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేస్తుంది. ఇదే విషయంలో తెలంగాణ టిడిపి తమ్ముళ్లు పార్టీ వైఖరిని చెప్పుకోలేక నర కయాతన పడుతున్నారు. టిఆర్ఎస్ నేతలు టిడిపి పై విరుచుకుపడుతుండడంతో వారు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. ఓ వైపు హై కోర్టు విభజన అంశం చంద్రబాబు మెడకు చుట్టుకోవడంతో టి టిడిపికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు.