`టోపీ` కేటాయింపుపై శశికళ ఆగ్రహం

అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ‌కు వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు తగులుతూనే ఉన్నాయి. ఎంతో ఆశ‌ప‌డిన‌ సీఎం పీఠం చేజారిపోగా ఇప్పుడు క్ర‌మ‌క్ర‌మంగా పార్టీపైనా ఆమె ప‌ట్టుకోల్పోతోంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌య‌లలిత నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఆర్‌కే న‌గ‌ర్‌లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. శ‌శిక‌ళ‌కు షాక్ త‌గిలింది. అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకుల చిహ్నం ఎవ‌రికీ ద‌క్క‌క‌పోవ‌డం శ‌శిక‌ళ‌ను తీవ్రంగా క‌లిచివేస్తోంద‌ట‌. అంతేగాక న‌మ్మి పార్టీని అప్ప‌గిస్తే.. ఇలా చేసినందుకు ఉప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిన‌క‌ర‌ణ్‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నార‌ట‌. `టోపీ` గుర్తుపై ఇప్పుడు ఆమె అసంతృప్తితో ఉన్నార‌ని స‌మాచారం.

పార్టీ చేతుల్లో ఉంది…పరువు పోయింది, రెండాకులు రాలిపోగా చివరకు ‘టోపీ’ మిగిలింది’ అంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మదనపడుతున్నారు. నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకుని బైటకు వచ్చిన తరువాత పార్టీని జాగ్రత్తగా తన చేతుల్లో పెట్టే నమ్మకమైన వ్యక్తి కోసం చిన్నమ్మ సాగించిన అన్వేషణలో ఆమె అక్క కుమారుడు టీటీవీ దినకరన్‌ మెలిగారు. పార్టీతోపాటు పదవి సైతం ఇచ్చినపుడే పెత్తనం సాధ్యమనే వ్యూహంతో దినకరన్‌కు దాదాపు తనతో సమానమైన హోదాగా ఉప ప్రధానకార్యదర్శి పదవిని కట్టబెట్టారు.

అర్కేనగర్‌లో ఉప ఎన్నికలు దినకరన్‌కు పెనుసవాళ్లు విసురుతున్నాయి. రెండాకుల చిహ్నంకై శశికళ, పన్నీర్‌ వర్గాలు పోటీపడ్డాయి. చివ‌ర‌కు రెండాకుల గుర్తును ఎన్నికల కమిషన్‌ ఎవ్వరికీ చెందకుండా చేయడంతోపాటు అన్నాడీఎంకే తరఫున పోటీచేయరాదని ఆంక్షలు విధించింది. దీంతో దినకరన్‌ ‘అన్నాడీఎంకే అమ్మ’ అనే పార్టీని స్థాపించి స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఇరువర్గాలు హతాశులైనా శశికళ వర్గాన్ని ఎక్కువగా బాధించింది. ఎంతో కష్టపడి స్వాధీనం చేసుకున్న అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం కూడా లేకుండా పోటీచేయ‌డాన్ని ఆమె జీర్ణించుకోలేక‌పోతున్నారు.

రెండాకుల చిహ్నం లేకుండా పోటీకి దిగి ఓటమి పాలైతే పన్నీర్‌వర్గం దీన్ని పరాభవంగా పరిగణించగలదని ఆమె వాపోతున్నారు. ఇళవరసి కుమారుడు వివేక్‌ శుక్రవారం బెంగళూరు జైలుకెళ్లి శశికళను కలుసుకున్నపుడు.. రెండాకుల చిహ్నం స్థానంలో టోపీ గుర్తును ఎన్నుకోవడం నలుగురిలో ఎద్దేవాగా మారిందని దినకరన్‌పై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. డాకుల చిహ్నంపై ఎన్నికల కమిషన్‌ విచారణ జరపడం ప్రారంభించగానే అప్రమత్తమై సరైన గుర్తును సిద్ధం చేసుకోవడంలో దినకరన్‌ విఫలమయ్యాడని ఆమె కోప్పడుతున్నార‌ట‌. ప్రజలకు ‘టోపీ’ పెట్టేందుకు వస్తున్నారని ప్రచారాల్లో గేలి చేస్తే గెలుపు ఎలా సాధ్యమని ఆమె తిట్టి పోశారు.