తెలంగాణలో ప్లాప్ హీరోయిన్ కొత్త పార్టీ

తెలంగాణ‌లో టీఆర్ఎస్‌కు పోటీగా స‌రికొత్త పార్టీ రాబోతోంది. సినీ వినీలాకాశంలో స్టార్‌గా వెలుగొంది.. రాజ‌కీయ నేత‌గా మారిన విజ‌య‌శాంతి మ‌రోసారి పార్టీ పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లో చేరి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన ఆమె.. మ‌రోసారి రాజ‌కీయ‌ తెర‌పై మెరిసేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్నారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో తీవ్రంగా పోరాడిన రాముల‌మ్మ‌.. సెకండ్ ఇన్నింగ్స్‌కు తెర‌తీయ‌బోతున్నారు. సొంత పార్టీతోనే ఇక రాజ‌కీయాల్లో యాక్టివ్ కావాల‌ని ఆమె సన్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి!!

రాముల‌మ్మ‌గా వెండితెర‌పై ఓ వెలుగు వెలిగిన విజ‌య‌శాంతి.. కొంతకాలం రాజ‌కీయాల్లోనూ రాణించారు. రాముల‌మ్మ గతంలోనూ తెలంగాణ త‌ల్లి పేరుతో పార్టీని న‌డిపారు. మెద‌క్ ఎంపీగా తెలంగాణ ఉద్య‌మంలో చురుగ్గా పాల్గొన్నారు. తర్వాత టీఆర్ఎస్‌లో చేరి కీల‌క‌ నాయ‌కురాలిగా కొన‌సాగారు. కానీ ఆ త‌ర్వాత కేసీఆర్ తో విభేదాలు రావ‌డంతో … హ‌ఠాత్తుగా కాంగ్రెస్ పంచ‌న చేరిపోయారు. ఆ పార్టీ త‌ర‌పున ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత ఆ పార్టీకి  దూర‌మైపోయారు!

తెలంగాణ ఉద్య‌మ కాలం నాటి కేసుల నేప‌థ్యంలో విజ‌య‌శాంతి.. త‌ర‌చుగా రైల్వే కోర్టుకు హాజ‌ర‌వుతున్నారు. ఈ నేప‌థ్యంలో నాటి ఉద్య‌మ‌కారులు ప‌లువురు ఆమెను క‌లుస్తున్నారు. రాజ‌కీయాల్లో ఎందుకు మౌనంగా ఉన్నారంటూ త‌ర‌చూ ఆమెను ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో ఆమెపై ఒత్తిడి అధిక‌మ‌వుతోంద‌ట‌, ఇప్ప‌టికే టీడీపీ, కాంగ్రెస్‌, బీజేపీ వంటి పార్టీలు ఉన్నా.. స‌రికొత్త వేదిక అయితే మంచిద‌ని భావిస్తున్నార‌ట‌. ముఖ్యంగా టీఆర్ఎస్ కు ప్ర‌త్యామ్నాయంగా ఒక పార్టీ పెట్టేందుకు ఆమె ఆలోచిస్తున్నార‌ని స‌మాచారం.

ఇప్పుడు అదే పార్టీని పున‌రుద్ధ‌రించాలా.. లేక కొత్త పార్టీ పెట్టాలా.. అన్న అంశం ఎటూ తేల్చుకోలేక‌పోతున్నార‌ని స‌మాచారం. అయితే స‌న్నిహితులు మాత్రం ఆమెను కొత్త పార్టీ పెట్టాల‌ని కోరుతున్నార‌ట‌. పార్టీ పేరు తెలంగాణ పున‌ర్ నిర్మాణ స‌మితి అయితే బావుంటుంద‌ని చెబుతున్నార‌ట‌. కొంత లేటైనా రాముల‌మ్మ మాత్రం కొత్త పార్టీ పెట్ట‌డం ఖాయ‌మ‌ని ఆమె స‌న్నిహితులు ఘంటాప‌థంగా చెబుతున్నారు. మ‌రి కేసీఆర్‌కు పోటీగా రాముల‌మ్మ కొత్త పార్టీ పెడ‌తారో లేదో.. వేచిచూడాల్సిందే!