తెలంగాణా లో మిగిలింది ఒకే ఒక్కడు!!

తెలంగాణలో పార్లమెంటు సభ్యుల సంఖ్య 17 కాగా, ఇద్దరిని మినహాయిస్తే అంతా టిఆర్‌ఎస్ పక్షంలోనే ఉన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 11 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి నంది ఎల్లయ్య, గుత్తాసుఖేందర్‌రెడ్డి, టిడిపి నుంచి మల్లారెడ్డి, బిజెపి నుంచి బండారు దత్తాత్రేయ, ఖమ్మంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి విజయం సాధించారు. ఎంఐఎం నుంచి అసదుద్దీన్ ఓవైసి విజయం సాధించారు. అనంతరం టిఆర్‌ఎస్ అధికారంలోకి రావడం, ఇతర పార్టీల నుంచి గెలిచిన వారు టిఆర్‌ఎస్‌లో చేరడంతో టిఆర్‌ఎస్ బలం పెరుగుతూ పోయింది. తాజాగా కాంగ్రెస్ ఎంపి గుత్తా టిఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకోవడంతో టిఆర్‌ఎస్ బలం 11నుంచి 14కు పెరిగింది.

తెలంగాణ నుంచి గెలిచిన ఏకైక టిడిపి ఎంపి మల్లారెడ్డి ఇటీవలే టిఆర్‌ఎస్‌లో చేరడంతో తెలంగాణ నుంచి టిడిపికి పార్లమెంటులో స్థానం లేకుండా పోయింది. అదే విధంగా ఖమ్మం నుంచి గెలిచిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఎంపి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఆ పార్టీకి కూడా తెలంగాణలో స్థానం లేకుండా పోయింది. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎంపిలు గెలిస్తే వారిలో గుత్తా కారెక్కేస్తున్నారు. ఇక మిగిలింది నంది ఎల్లయ్య మాత్రమే. వీరు కాకుండా బిజెపికి చెందిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంఐఎం ఎంపి అసదుద్దీన్‌లు మిగిలారు. బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రిగా తెలంగాణ ప్రభుత్వంతో స్నేహపూర్వకంగానే వ్యవహరిస్తున్నారు. ఎంఐఎం ఏకంగా టిఆర్‌ఎస్‌కు మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది.

మిగిలిన ఏకైక ఎంపి నంది ఎల్లయ్య మాత్రమే. నాగర్‌కర్నూల్ నుంచి గెలిచిన నంది ఎల్లయ్యను ఇటీవలే కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ఇన్‌చార్జ్‌గా నియమించారు.ఎల్లయ్య ఒకే ఒక్కడులా తెరాస పై పోరాడుతాడో తెరాస ఆపరేషన్ ఆకర్ష కి లోన్గుతాడో చూడాలి మరి.