తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చిందా!

వారు ముగ్గురూ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీల‌క నేత‌లు! అయితేనేం ఎవ‌రి రాజ‌కీయాలు వారివి. ఎవరి వ్యూహాలు వారివి! ఒక‌రితో ఒక‌రికి పొంత‌న ఉండ‌దు. ఎప్పుడూ క‌లుసుకోరు.. క‌లిసినా మాట్లాడుకోరు!! అలాంటి వారు ముగ్గురూ విభేదాలు ప‌క్క‌న పెట్టారు. శ‌త్రుత్వాన్ని మరిచి.. పార్టీ కోసం చేయీచేయీ క‌లిపారు. పార్టీకి జ‌వ‌స‌త్వాలు నింపాల‌ని నిర్ణ‌యించారు. అంతేకాదు క‌లిసి భోజ‌నం చేశారు! ఆ నేత‌లే జానారెడ్డి, ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, కోమ‌టిరెడ్డి వెంక‌టరెడ్డి!!

తెలంగాణ‌లో ఇచ్చినా ఆ క్రెడిట్ సంపాదించుకోలేక పూర్తిగా చ‌తికిల‌పడిపోయింది కాంగ్రెస్‌!! ఇక టీఆర్ఎస్‌పై స‌మ‌ర శంఖం పూరించిన ప్ర‌తిసారీ.. కేసీఆర్ వ్యూహాల‌తో చిత్తు అవుతూ వ‌స్తోంది. అయితే నాయ‌క‌త్వ లోపం కూడా కాంగ్రెస్‌కు స‌మ‌స్య‌గా మారింది. ముఖ్యంగా సీనియ‌ర్ నేత జానారెడ్డి, ఉత్త‌మ్ కుమ‌ర్ రెడ్డిలు ఎవ‌రికి న‌చ్చిన‌ట్టు వారు వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో ఇంకా సంధి ద‌శ‌లోనే ఉంది. అయితే ఇటువంటి స‌మ‌యంలో ఉత్తర దక్షిణ ధ్రువాలన్నట్లుగా ఉండే ఇద్దరు ప్రముఖ నేతలు చేతులు కలపటం చిన్న విషయం కాదు. దాదాపు ఏడేళ్ల నుంచి ఉప్పు..నిప్పులా వ్యవహరిస్తున్న ఉత్తమ్.. కోమటిరెడ్డిల మధ్య వైరం ఒక కొలిక్కి రావటమే కాదు.. ఇరువురి మధ్య మాటలు కలవటం ఆసక్తికరంగా మారింది.

జానారెడ్డి.. ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఒకే వేదిక మీదకు రావటం.. కలిసిమెలిసి మాట్లాడుకోవటం.. తమ మధ్య దూరం తగ్గిపోయిందన్న సందేశాన్ని ఇచ్చేలా వ్యవహరించటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. నల్గొండ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకువచ్చిన ఈ ముగ్గురు నేతలు కలిసి భోజనం చేశారు. రాష్ట్ర రాజ‌కీయాల‌పై మంతనాలు జ‌రిపారు.

పాత నల్గొండ జిల్లాకు చెందిన జానా.. ఉత్తమ్.. కోమటిరెడ్డిల మధ్య 2009 నుంచి వారి మధ్య సరైన సంబంధాలు లేవు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కోమటిరెడ్డి తన మంత్రిపదవికి రాజీనామా చేయటం.. ఆ స్థానంలో ఉత్తమ్ కు చోటు లభించటంతో వీరి మధ్య గొడవలు మరింత ముదిరాయి. ఇలాంటి వేళ.. అందుకు భిన్నంగా కోమటిరెడ్డి ఇంటికి ఉత్తమ్.. జానాలు భోజనానికి వెళ్లటం తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్లేనని చెబుతున్నారు. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కూ కాంగ్రెస్‌కు లాభిస్తుందో వేచిచూడాల్సిందే!!