త్వరలో రెడ్డిగారి రాజకీయ సన్యాసం?

తెలంగాణ కాంగ్రెస్ భీష్ముడు జానా రెడ్డి రాజకీయ అస్త్ర సన్యాసం చేయబోతున్నాడా?అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.దీనికి బలం చేకూరుస్తూ తాజాగా రెడ్డి గారి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.పదవి ముఖ్యంకాదు… పార్టీ బలోపేతమే నా లక్ష్యం… ఏ పదవీ లేకుండానే మహాత్ముడు స్వరాజ్యం సాధించారు.. ఈ మాటలన్నది ఎవరో కాదు.. తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి.. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై జానా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.. తమ పార్టీ నేతలకు అధికార టిఆర్ఎస్ గేలం వేయటాన్ని జానా జీర్ణించుకోలేకపోతున్నారు..

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఒకొక్కరుగా కారెక్కుతుండటం ఆ పార్టీ ముఖ్య నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.. నిన్న మొన్నటి వరకూ ప్రక్కనున్న నేతలే రాత్రికి రాత్రి అధికార పార్టీ కండువా కప్పుకోవటం ఆ పార్టీ నేతలను కలవరపెడుతోంది.. ముక్కూ మొఖం తెలియక పోయినా రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన సొంత పార్టీని కాదని ఇతర పార్టీల్లోకి వెళ్తున్న వారి తీరు ఇపుడు టి.కాంగ్రెస్ నేతలను ఇబ్బందులకు గురి చేస్తోంది.. అసలు తమ పార్టీ నేతలు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు పార్టీ మారుతున్నారో తెలియక రాష్ట్ర నాయకత్వం తలలుపట్టుకుంటోంది.

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు సి.ఎల్పీ నేత జానారెడ్డి.. నవ తెలంగాణ రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయాలుంటాయని ప్రజలు ఆశించారని ఇపుడు ఆ పరిస్ధితులు కనిపించటం లేదంటున్నారు.. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందంటూ తనదైన శైలిలో అధికార పార్టీ తీరు ను తప్పు పట్టారు. పార్టీ మారుతున్న నేతలు పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని జానా కోరుతున్నారు.. ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టి.ఆర్.ఎస్ కు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గర్లో ఉందన్నారు.. ఫిరాయింపు చట్టంలో మార్పులు తేవాలని కేంధ్రానికి విజ్ఞప్తి చేసారు.

తన రాజకీయ శిష్యుడిగా పేరొందిన మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు కారెక్కటానికి రెడీ అయ్యారు..తన మాటకాదని ఏ పనీ చేయని భాస్కర్ రావు పార్టీ మారుతారని జానారెడ్డి ఊహించలేదు.. ఈ హఠాన్ పరిణామంతో జానారెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. తాజా రాజకీయ పరిణామాలు తనను తీవ్రంగా బాధిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.. సి.ఎల్పీ పదవిపై తనకు మక్కువ లేదని చెప్పిన ఆయన సామాన్య కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.. అయితే తన మనసులో మాటను పార్టీ అధినేత్రి సోనియాకు చెప్పిన తర్వాతే ఫైనల్ డెషిషన్ తీసుకుంటానని చెప్పారు.

ఇదిల ఆఉంటే జానా ఆశీస్సులతోనే భాస్కర్ రావు పార్టీ మార్పు నిర్ణయం తీసుకున్నారని,అసలు జన రెడ్డి TRS కోవర్టు అంటూ చాలా కాలం నుండి ప్రచారం సాగుతోంది. కొన్ని పత్రికల్లో వచ్చిన ఈ వార్తలపై జానా తీవ్రంగా స్పంధించారు..నీచ రాజకీయాలు చేయటం తనకు తెలియదన్నారు.. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ పదవులకోసం ప్రాకులాడలేదన్న ఆయన తెలంగాణ కోసం ముఖ్యమంత్రి పదవినే వదులుకున్నానని తెలిపారు.. మొత్తానికి జానారెడ్డి ఆవేదనపై హై కమాండ్ ఎలా స్పంధిస్తుందో చూడాలి మరి.