దేవుడి జోలికెళ్లారు:అనుభవిస్తారు

అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పటికీ, తాము ఏ సాంప్రదాయాల పరిరక్షణ కోసమయితే పోరాడుతున్నామో, ఆ సాంప్రదాయాలకు కేంద్రమైన దేవాలయాలను ప్రభుత్వమే కూల్చివేస్తుంటే కళ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి దయనీయమే. సర్కారు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేక, అలాగని ఊరుకోలేక మధనపడుతున్న కమలనాథుల తీరు… ముందు నుయ్యి, వెనుక గొయ్యి చందంగా మారింది. విజయవాడలో ఇటీవలి కాలంలో శరపరంపరగా జరుగుతున్న ఆలయాలను కూల్చివేస్తూ తెదేపా సర్కారు దూకుడుగా వ్యవహరిస్తుంటే, భాగస్వామ్య పక్షంగా కనీసం అడ్డుకోలేని దుస్థితి తమ నాయకత్వంలో కనిపిస్తోందని బిజెపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కృష్ణా పుష్కరాల సందర్భంగా రోడ్ల వెడల్పు, ఘాట్ల పేరుతో ఇప్పటివరకూ విజయవాడలో దాదాపు 45 దేవాలయాలు కూల్చివేశారు. అందులో 90 ఏళ్ల నాటి పురాతన దేవాలయాలు కూడా ఉండటం భక్తుల మనోభావాలను గాయపరిచినట్టయింది. ఈ విషయంలో స్థానికులు బిజెపి నేతలను ఆశ్రయించారు. అయితే వారికి ఎలాంటి హామీ ఇవ్వాలో తెలియక చేతులెత్తేయాల్సిన పరిస్థితి బిజెపి నేతలది. కూల్చివేతలను నేరుగా అడ్డుకోలేక, ప్రభుత్వాన్ని విమర్శించలేక సతమవుతున్నారు.

అయితే, బిజెపి నేతల నిస్సహాయంపై విశ్వహిందూ పరిషత్, హిందూ ధర్మ పరిరక్షణ సమితి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకూ కృష్ణా పుష్కరాల కోసమని విజయవాడలోని శనీశ్వరాలయం, స్వయంభూ అమ్మవారి ఆలయం, సీతమ్మవారి పాదాలను పెకలించారు. భవానీపురం, వన్‌టౌన్, రామవరప్పాడు, గవర్నరుపేట, కృష్ణలంక, సింగ్‌నగర్‌లో దాదాపు 45 ఆలయాలను కూల్చివేశారు. హిందూ ఆలయాల కూల్చివేతలపై బిజెపి నేతల్లో కనీస స్పందన కనిపించకపోవడంతో మఠాథిపతులు, పీఠాధిపతులు రంగంలోకి దిగారు. ఈనెల 4న 352 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు, సాధుసంతులతో విజయవాడలో నిరాహారదీక్ష చేయాలని అఖిల భారత హిందూ దేవాలయ ప్రతిష్ఠాపన పీఠాధిపతి కమలానంద భారతి, తల్లాయపాలెం శివక్షేత్ర పీఠాధిపతి శివస్వామి నిర్ణయించారు. ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరికి మద్దతు ఇస్తున్నట్లు వీహీచ్‌పి రాష్ట్ర అధ్యక్షడు హరినాథరెడ్డి, హిందూ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.విద్యాధరరావు ప్రకటించారు.

‘గత పుష్కరాల సమయంలో 108 నాగప్రతిమలు, రెండు శివలింగాలను తొలగించి ఘాట్లు నిర్మించి అపచారం చేశారు. అందుకే విషాదం చోటుచేసుకుంది. ప్రభుత్వం హిందూ ఆలయాల జోలికి వస్తే పాలకులను భగవంతుడే శిక్షిస్తాడ’ని శివస్వామి హెచ్చరించారు. కూల్చివేతలపై బిజెపి ఎంపి గోకరాజు గంగరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెదేపా నేతలు రౌడీలు, గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దేవాలయాల జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.

తాజా పరిణామాలపై బిజెపి నేతలలో అంతర్మథనం మొదలయింది. తెదేపా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటంతోపాటు, ఎండోమెంట్ శాఖను స్వయంగా తమ పార్టీకి చెందిన నాయకుడే నిర్వహిస్తుండటంతో, దేవాలయాల కూల్చివేతలపై ఏవిధంగా స్పందించాలో ఎవరికీ అర్ధం కాకుండా పోయింది. కూల్చివేతలపై స్పందించకపోవడంతో సామాన్య భక్తులు, హిందువుల్లో తాము అధికారానికి బానిసలయ్యామన్న అపప్రద ఎదుర్కోవలసి వస్తోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది.

‘కృష్ణానదీ తీరంలో ఇప్పటిదాకా 45 దేవాలయాలు కూల్చేశారు. అందులో 90 ఏళ్ల నాటి దేవాలయాలున్నాయి. అయినా పార్టీ అధ్యక్షుడి నుంచి శాసనసభాపక్ష నేత, మంత్రుల వరకూ ఎవరూ ఖండించలేదంటే మా పార్టీ ఎంత పరాధీనంగా మారిందో అర్ధమవుతోంది. ప్రైవేట్ లిమిటెడ్ నుంచి పబ్లిక్ పార్టీగా మారినప్పుడే మా పార్టీ దశ మారుతుంద’ని ఓ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలు ఈ సందర్భంగా గమనార్హం.