నితిన్ కి ఇంకా ఆ మోజు పోలేదు

యంగ్‌ హీరో నితిన్‌ క్లాస్‌ సినిమాలతో సక్సెస్‌ల మీద సక్సెస్‌లు కొడుతున్నాడు. ‘ఇష్క్‌’, ‘గుండె జారి గల్లంతయ్యిందే’, ‘అఆ’ సినిమాలతో జోరు మీదున్న ఈ యంగ్‌ హీరో, కొన్ని ఫెయిల్యూర్స్‌ కూడా ఈ మధ్యకాలంలో చవిచూశాడు. ఒకప్పుడు మాస్‌ హీరో అయిపోదామనుకుని బొక్క బోర్లా పడ్డ నితిన్‌, ఆ తరువాత మళ్లీ క్లాస్‌ బాట పట్టాడు. మాస్‌ తనకి సూట్‌ కాలేదనుకున్నాడు కాబోలు క్లాస్‌ టచ్‌ ఇస్తూ విజయాల బాటలో దూసుకెళ్తున్నాడు.

తాజాగా ‘అ,ఆ..’ సినిమాతో నితిన్‌ మార్కెట్‌ మరీ పెరిగిపోయింది. దాంతో పెద్ద డైరెక్టర్లు కూడా నితిన్‌తో సినిమా చేయడానికి ముందుకొస్తున్నారు. ప్రస్తుతం ఒక టాప్‌ డైరెక్టర్‌తో నితిన్‌ చర్చలు జరుపుతున్నాడని సమాచారం. ఆ సినిమాలో నితిన్‌ సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనున్నాడట. గతంలో ఒకసారి నితిన్‌ సిక్స్‌ పాక్‌లో దర్శనమిచ్చాడు. మళ్లీ ఇప్పుడు కథ పరంగా సిక్స్‌పాక్‌ దేహం కోసం కసరత్తులు చేస్తున్నాడట ఈ కుర్ర హీరో. ఈ సినిమాకు దిల్‌ రాజు నిర్మాణం వహించవచ్చునని తెలుస్తోంది.

గతంలో ‘దిల్‌’ సినిమాతో స్టార్ట్‌ అయిన వీరిద్దరి కాంబినేషన్‌ మళ్లీ రిపీట్‌ కానున్నదని వినికిడి. ఈ సినిమాకు ‘అ,ఆ..’ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించిన అనుపమా పరమేశ్వరన్‌ సోలో హీరోయిన్‌గా నటిస్తోందట. ‘ఆ,ఆ..’ లో సింపుల్‌గా రొమాంటిక్‌ లుక్‌లో కనిపించిన నితిన్‌ ఈ సినిమా కోసం డిఫరెంట్‌ లుక్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆ ప్రముఖ డైరెక్టర్‌ పేరు, సినిమా తదితర విషయాలు రివీల్‌ కానున్నాయి.