నేనింతే అంటున్న అనుష్క

దక్షిణాదిన ఒకట్రెండు విజయాలు సాధిస్తే చాలు బాలీవుడ్‌లో వాలిపోవాలని కలలుకంటుంటారు కథానాయికలు. కానీ అనుష్క ఈ పదేళ్ల ప్రయాణంలో ఒక్కసారి కూడా బాలీవుడ్‌ మాటెత్తలేదు. కారణం ఏమిటి? ఇదే విషయాన్ని అనుష్కని అడిగితే… ‘‘బాలీవుడ్‌లో నటించకూడదు అని నేనేం గిరి గీసుకోలేదు. అక్కడి నుంచి చాలా అవకాశాలు వచ్చాయి. సల్మాన్‌ ఖాన్‌ సినిమాలోనూ ఓసారి అడిగారు. అయితే నేను ఒప్పుకోలేదు.

ఓ కొత్త పరిశ్రమలోకి అడుగుపెడుతున్నప్పుడు మనసుని ఉత్సాహపరిచే పాత్ర దొరకాలి. రొటీన్‌ కథల్ని ఎంచుకొని ప్రయోజనం ఉండదు. నాకు ఫ్రెంచ్‌, కొరియన్‌, ఇరానీ సినిమాలంటే చాలా ఇష్టం. అక్కడ కొత్త కాన్సెప్టులు కనిపిస్తాయి. అయితే అక్కణ్నుంచి అవకాశాలొచ్చినా వెంటనే ఒప్పుకోను. ‘కథ బాగుంటేనే’ అనే షరతు వాటికీ వర్తిస్తుంది. ఈ విషయంలో నా పద్ధతి మార్చుకోలేను’’ అంది.