పట్టిసీమ:చుక్క నీరు రాలేదు బాబూ..

అధికార పార్టీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పట్టిసీమ ముచ్చటగా మూడోసారి గండి పడింది. ప్రారంభించడం ఆ వెంటనే ఏదో ఒక సమస్యతో ఆపేయడం గత మూడు సార్లు ఇదేతంతు. ఎక్కడైనా ఏ కొత్త ప్రాజెక్టునైనా పూర్తయిన తరువాత జాతికి అంకితం చేయడం మనం చూస్తాం. కానీ మన చంద్రబాబు లోకానికి విరుద్ధంగా ఆలు లేదు చూలు లేదు ఆరంభించేద్దాం అన్న చందాగా తయారయ్యారు. అది పట్టిసీమయినా సరే అమరావతి సచివాలయం అయినా సరే. ప్రారంభించడం జాతికి అంకితం చేయడం పూలు చల్లడం అది అటకెక్కడం. అబ్బే తూచ్ అంటూ మళ్ళీ ప్రారంభం సమస్య రావడం, ఆగిపోవడం ఇదే తంతు.

పట్టిసీమ ద్వారా కృష్ణా, గోదావరి జలాల అనుసంధానానికి మూడోసారి ‘గండి’ పడింది. ఇప్పటికి నీరొదిలిన మూడుసార్ల్లూ ఏదో ఒక సమస్య రావడంతో సరఫరాను నిలిపేల్సి వచ్చింది. ఒకవైపు కృష్ణమ్మ నీరు లేక అల్లాడిపోతోంది. మరోవైపు గోదారమ్మ ఉప్పొంగుతోంది. అక్కడ వరదొచ్చిన సమయంలోనే నీటిని కృష్ణా నదికి మళ్లిస్తామని ప్రభుత్వం ఎప్పటిలాగే హామీనిచ్చింది. కానీ ఆ వరద సముద్రం పాలవుతోంది మినహా పట్టిసీమ ద్వారా కృష్ణానదికి చుక్కనీరొచ్చి చేరలేదు. అడుగడుగునా అవాంతరా లతో నీటి రాక నిలిచిపోయింది.

దీనికితోడు పనుల్లో జరిగిన నాణ్యత లోపాలతో ఎక్కడికక్కడ అవాంతరాలు ఏర్పడుతున్నాయి.ఇక్కడ కామెడీ ఏంటంటే గుత్తేదారుకు బోనస్ ఇచ్చి మరి పనులు చేయించారు. ఈ మొత్తం వ్యవహారానికి గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం అని పేరు. ఈ గోదావరి-కృష్ణా అనుసంధాన సమయంలో పశ్చిమగోదావరి జిల్లా జానంపేట సమీపంలో తమ్మిలేరుపై వంతెన కుప్పకూలిపోయింది. దీంతో నీటి సరఫరాను నిలిపేశారు. అనుసంధానం పేరుకే తప్ప ఒక్క క్యూసెక్కు నీరూ కృష్ణకు చేర లేదు. గతేడాది ఆగస్టు 16వ తేదీన విజయవాడ వద్ద ఫెర్రీ సమీపాన సంగమం పేరిట కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసేసారు. మరునాడే నీటిని నిలిపేశారు. ఆ సమయంలో నీటిని వదిలిన కొద్ది కాలంలోనే పెదవేగి మండలం జానంపేట వద్ద వంతెన కూలిపోయింది. దీనికి రిపేర్లు పేరుతో నీటిని నిలిపేశారు. ముచ్చటగా మూడోసారి ఇటీవల పట్టిసీమ మోటార్లను ఆన్‌చేసి నీటిని విడుదల చేశారు. వెంటనే పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద గట్టుకు రంధ్రం పడింది దీంతో వెంటనే నీటి సరఫరాను నిలిపేశారు.

ఈ మొత్తం వ్యవహారంలో రాయలసీమ పేరు మచ్చుకైనా వినిపించకపోవడం గమనార్హం. అసలు పట్టిసీమ పుట్టుకే రాయలసీమ సాగు తాగునీటికోసం అని చంద్రబాబు ప్రారంభోపన్యాసం ఇచ్చేసారు. ఇప్పుడు ఆ ఊసే లేదు. వృధా నీటిని వాడుకోవడం మంచిదే కానీ దానివల్ల చారిత్రాత్మకమైన, రాష్టానికి గుండెకాయలాంటి ఓ మహా ప్రాజెక్టు అయిన పోలవరం మరుగునపడిపోతుంది అని మేధావులు రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా ప్రభుత్వ ప్రచార ఆర్భాటం ముందు అవేమి వినిపించలేదు. మేము పట్టిసీమ ప్రారంభించాం నదుల అనుసంధానం చేసేసాము అని అనిపించుకోవడం కోసమే తాపత్రయం అంతా.

అయితే 10వ తేదీ నాటికి పట్టిసీమ నీరు కృష్ణా నదికి వచ్చి చేరుతుందని నారుమడులు పోసుకోవచ్చని చంద్రబాబు నాయుడు “హామీ” ఇచ్చేసారు. చుక్క రాలేదు. దీనిపై మంత్రులెవరూ నోరెత్తడం లేదు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా పట్టిసీమ నీరు ప్రకాశం బ్యారేజీకి చేరుకోకపోగా దీని ప్రారంభోత్సవం ఒక ప్రహసనంగా తయారైంది.