పవన్ కళ్యాణ్ సంపాదన వారికే సరిపోతుందట

పవన్ కళ్యాణ్ ఈ పేరు అటు టాలీవుడ్ లోను ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ బాగా పాపులర్ పేరు. అయితే ఇప్పటిదాకా పూర్తిస్థాయి రాజకీయాలలోకి రాని పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి సభ, నిన్నటి కాకినాడ సభలతో ఇక ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తానని చాటాడు. ఈ సభలలో తనదగ్గర డబ్బులేదని హిరంగంగానే చెప్పాడు పవన్ కళ్యాణ్.

విమర్శకులు మాత్రం ప్రతి సినిమాకి 20 కోట్లు పారితోషకం తీసుకునే ఈ హీరో దగ్గర డబ్బు లేకపోవటం ఏంటని విమర్శించారు. ఈ విషయం పై జాతీయ మీడియా ఒక ఆసక్తికరమయిన కధనాన్ని ప్రచురించింది. పవన్ కళ్యాణ్ తన కోసం, తన కుటుంబం కోసం భవిష్యత్ అవసరాలకు గానూ డబ్బు దాచుకున్నదేమీ లేదని పేర్కొంది. పవన్ కళ్యాణ్ జీవితం చాల నిరాడంబరంగా ఉంటుందని కొనియాడింది. పవన్ ఆఫీస్ లో పనిచేసే 12 మంది సిబ్బంది కి, తన ఫామ్ హౌస్ లో పనిచేసే 25 మందికి ఏలోటూ రాకుండా చూసుకుంటాడని వారి జీతాల నిమిత్తమే ఎక్కువశాతం ఖర్చు చేస్తాడని వివరించింది.

ఇదికాకుండా అభిమానుల తాకిడినుండి తట్టుకోవటానికి మరో 12 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఎప్పుడు తనవెంట వుండేటట్టు వ్యక్తిగత భద్రతాసిబ్బందిగా పెట్టుకున్నాడని, వారికిచ్చే జీతాలు అదనమని వివరించింది. పేరుకే 20 కోట్ల పారితోషకం తీసుకున్నా దాంట్లో వారికోసమే ఎక్కువ ఖర్చుచేస్తాడని వెల్లయించింది. ఇక 2013 నుంచి ఇప్పటివరకు ఆయన చేసింది ‘‘అత్తారింటికి దారేది’, ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ రెండు సినిమాలు మాత్రమేనన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా.. 20 కోట్ల పారితోషికాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవడమేంటని విమర్శకులకు ప్రశ్న వేసిందా పత్రిక.

వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అని, కాబట్టి ఎవరు ఏ కష్టంలో ఉన్నారని తెలిసినా వెంటనే సాయం చేస్తాడని కొనియాడింది. అలాంటి ఖర్చులనూ లెక్కలోకి తీసుకుంటే పవన్ ఎంత ఖర్చుల్లో వున్నాడో, లోటులో ఉన్నాడో అర్థమవుతుందని తెలిపింది. అంతేగాకుండా మొన్న జరిగిన సభలను తన సొంత ఖర్చుతోనే నిర్వహించాడని వెల్లడించింది. సమకాలీన రాజకీయ వేత్తల్లా కాకుండా నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతున్నాడంటూ పవన్ కళ్యాణ్ ని కొనియాడింది.