పవన్ – జగన్ పాలిటిక్స్ ఏ మేరకు ఫలిస్తాయో!

టీడీపీ నేత‌ల పాలిటిక్స్ రోజుకోర‌కంగా మారుతున్నాయి.  ఏపీలో జ‌గ‌న్‌ని విల‌న్‌ను చేయ‌డం ద్వారా ల‌బ్ది పొందాల‌ని ఎప్ప‌టిక‌ప్పుడు ప్లాన్ చేసేస్తున్న నేత‌లు.. ఈ విష‌యంలో అందివ‌చ్చిన ప్ర‌తి అవ‌కాశాన్నీ స‌ద్వినియోగం చేసుకుంటున్నారు. వీరికి అవ‌కాశం ఇచ్చారా? అన్న‌ట్లు జ‌గ‌న్ కూడా కొన్ని సంద‌ర్భాల్లో వివాదాస్ప‌దంగానే ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. ఇక‌, అస‌లు విష‌యానికి వ‌చ్చేస‌రికి.. జ‌గ‌న్ పై కేసుల విష‌యాన్ని చూపించ‌డం ద్వారా జనాల్లో ప‌లుచ‌న చేయాల‌ని, త‌ద్వారా ల‌బ్ధి పొందాల‌ని టీడీపీ నేత‌లు ప‌క్కా ప్లాన్‌తో ముందుకు పోతున్నారు.

ఇక‌, ఇదే విష‌యంలో జ‌గ‌న్ కూడా కొంచెం దూకుడుగానే ఉన్నాడు. నిన్న ప్రారంభించిన అసెంబ్లీలోకి సీఎం చంద్ర‌బాబు వంటి కేసులు ఎదుర్కొంటున్న వ్య‌క్తిని ఎంట‌ర్ చేయొద్దంటూ పెద్ద ఎత్తున అసెంబ్లీ స్పీక‌ర్‌కి లేఖ‌రాశారు. ఈ రెండు విష‌యాలూ ప‌ర‌స్ప‌రం విమ‌ర్శించుకుంటున్న‌వే. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ దంతా పిల్ల వ్య‌వ‌హార‌మ‌ని, ఆవేశం త‌ప్ప ఆలోచ‌న లేద‌ని టీడీపీ నేత‌లు క్రియేష‌న్ మొద‌లు పెట్టారు. దీనికి మొన్నామ‌ధ్య విశాఖ ఎయిర్ పోర్టు ఉదంతాన్ని వాడుకుంటున్నారు. ఇప్ప‌టికే విశాఖ సీఎంగారు.. అంటూ మంత్రి దేవినేని ఉమా ప‌లు సంద‌ర్భాల్లో జ‌గ‌న్‌ని ఎద్దేవా చేశాడు కూడా.

తాజాగా.. జ‌గ‌న్ మ‌రో సారి త‌న ఆవేశం ప్ర‌ద‌ర్శించి టీడీపీకి చిక్కిపోయాడు. జేసీ బ‌స్సు ప్ర‌మాదం ఘ‌ట‌న విష‌యంలో నేరుగా క‌లెక్ట‌ర్‌పై చేసిన వ్యాఖ్య‌లు నిజంగానే ఆయ‌న‌కు ప్ల‌స్సుల క‌న్నా మైన‌స్సులు ప‌డేలా చేసింది. ఇది టీడీపీకి అయాచిత వ‌రంగా మారింది. తాజాగా టీడీపీ సీనియ‌ర్ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి.. మాట్లాడుతూ.. ప‌వ‌న్ ను చూసి జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు అన్నారు. ఇది ఒక‌ర‌కంగా జ‌గ‌న్ అండ్ కో పార్టీని ప‌వ‌న్‌పైకి మళ్లించ‌డమే. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌ని జ‌గ‌న్ కానీ, ప‌వ‌న్ .. జ‌గ‌న్‌నికానీ ప‌ల్లెత్తు మాట అన‌లేదు. కానీ, టీడీపీ నేత అభిప్రాయం ప్ర‌కారం.. జ‌గ‌న్‌ని మాన‌సికంగా దెబ్బ‌కొట్ట‌డం ద్వారా.. మ‌రింత ల‌బ్ధి పొంద‌డ‌మే.

మ‌రి టీడీపీ ప్ర‌య‌త్నాలు ఏ మేర‌కు ఫ‌లిస్తాయో చూడాలి. ఇక‌, టీడీపీ జ‌గ‌న్ సెంట‌ర్‌గా చేస్తున్న ప్ర‌తి విమ‌ర్శ కూడా గ‌తంలో చంద్ర‌బాబు విప‌క్ష నేత‌గా ఉన్న‌ప్పుడు చేసిన‌వే. మ‌హారాష్ట్ర‌లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్య‌తిరేకంగా చంద్ర‌బాబు అక్క‌డ ధ‌ర్నా చేసి .. రాష్ట్ర సీఎం కిర‌ణ్ కుమార్‌పై విరుచుకుప‌డ్డారు. అదేస‌మ‌యంలో పాద‌యాత్ర సంద‌ర్భంగా అన్ని ప‌క్షాల‌పైనా నిప్పులు చెరిగారు. ప్ర‌స్తుతం ఇవే ప‌నులు జ‌గ‌న్ చేస్తున్నారు. లేక‌పోతే.. ఇంత‌స్థాయిలో విప‌క్షంపై టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు సంధించేవారు కారేమో! అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ రెండు ప‌క్షాల మ‌ధ్య ఇంకెలాంటి మాటల యుద్ధాలు చూడాలో?!