పవన్ వారిద్దరిని ఎలా హ్యాండిల్ చేస్తాడో!

ఏపీలో 2019 ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన ఎంట్రీతో రాజ‌కీయం చిత్ర‌విచిత్రంగా రంగులు మార‌నుంది. జ‌న‌సేనాని ప‌వ‌న్ పూర్తిగా పొలిటిక‌ల్ క్షేత్ర‌రంగంలోకి దూకితే అధికార టీడీపీ, విప‌క్ష వైసీపీ నాయ‌కుల్లో చాలా మంది జ‌న‌సేన‌లోకి జంప్‌చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన విజ‌య‌వాడ న‌గ‌రంలో రాజ‌కీయాలు సైతం స‌రికొత్త‌గా మార‌నున్నాయ‌న్న చ‌ర్చ‌లు అప్పుడే స్టార్ట్ అయ్యాయి.

ఇక్క‌డ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డంతో కాపు కార్డును ప్ర‌యోగించి చంద్ర‌బాబుపైనే విమ‌ర్శ‌లు చేశారు. ఈ విష‌యంలో బొండా ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబు వార్నింగ్ ఇవ్వ‌డంతో ఆయ‌న మొత్త‌బ‌డ్డార‌ని వార్త‌లు వ‌చ్చినా బొండా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి జ‌న‌సేన‌లోకి జంప్ చేయ‌డం ఖాయ‌మ‌న్న టాక్ కూడా వ‌స్తోంది.

ప‌వ‌న్ బ‌ర్త్‌డేల‌తో పాటు ప‌వ‌న్ సినిమాల రిలీజ్ టైంలో విజ‌య‌వాడ‌లో బొండా ఫ్లెక్సీలు, క‌టౌట్ల‌తో చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మ‌న‌సంతా జ‌న‌సేన వైపేలాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇక విజ‌య‌వాడ న‌గ‌ర వైసీపీ అధ్య‌క్షుడిగా ఉన్న వంగ‌వీటి రాధాను ఆ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌డంతో జ‌గ‌న్ తీరుపై ర‌గిలిపోతోన్న రాధా సైతం జ‌గ‌న్‌కు షాక్ ఇచ్చి జ‌న‌సేన చెంత‌కు చేర‌తార‌న్న ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది. గ‌తంలో రాధా-ప‌వ‌న్ ప్ర‌జారాజ్యం పార్టీలో క‌లిసి ప‌నిచేశారు.

వీరిద్ద‌రు జ‌న‌సేన‌లోకే చేరితే ఇద్ద‌రి క‌న్ను సెంట్ర‌ల్ సీటు మీదే ఉంది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య జ‌న‌సేన సీటు కూడా ప‌వ‌న్ ద‌గ్గ‌ర పంచాయితీ త‌ప్ప‌ద‌న్న చ‌ర్చ‌లు అప్పుడే విజ‌య‌వాడ‌లో స్టార్ట్ అయ్యాయి. బొండా సెంట్ర‌ల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇక రాధా సెంట్ర‌ల్ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్నాడు. దీంతో వీరిద్ద‌రు అదే సీటు కోసం పోటీప‌డితే ప‌వ‌న్ వీరి మ‌ధ్య పంచాయితీ చేయ‌క త‌ప్పేలా లేదు. ఏదేమైనా జ‌న‌సేన విజ‌య‌వాడ రాజ‌కీయం రంజుగా మారుతుంద‌న‌డంలో ఎలాంటి డౌట్ లేదు.