పోలవరం ప్రాజెక్టు.. ప్లానింగ్ కేవలం కాగితాలకే

న‌వ్యాంధ్రప్ర‌దేశ్‌కు అత్యంత కీల‌క‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టు విష‌యంలో సీఎం చంద్ర‌బాబుకు పెద్ద షాక్ త‌గిలింది. 2019 ఎన్నిక‌ల‌కు ముందుగానే ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోను పూర్తి చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకున్న చంద్ర‌బాబు ప్ర‌తి సోమ‌వారం పోల‌వ‌రం ప‌నుల‌పై స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఇటీవ‌లే ఆయ‌న ప్రాజెక్టు స్పిల్ వే ప‌నుల కోసం మ‌రోసారి అట్ట‌హాసంగా శంకుస్థాప‌న కూడా చేశారు. ప్రాజెక్టు తొలిద‌శ ప‌నుల‌ను 2018 కు పూర్తి చేస్తామ‌ని చెప్పారు. ప్రాజెక్టు కోసం సీఎం చంద్ర‌బాబుతో పాటు ఇరిగేష‌న్ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప‌దే ప‌దే ప్ర‌క‌ట‌న‌లు కూడా చేస్తున్నారు.

అయితే తాజాగా పోల‌వ‌రం ప‌నుల‌కు బ్రేకులు ప‌డ్డాయి. ఇక్క‌డ ప‌ని చేస్తోన్న త్రివేణి సంస్థ తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రాజెక్టు స్పిల్ వే కాంట్రాక్టు ద‌క్కించుకున్న ప్ర‌ధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్ త్రివేణి సంస్థ‌కు డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డంతో త్రివేణి త‌న కార్య‌క‌లాపాలు నిలిపివేసింది. ఇటీవ‌లే బాబు స‌ర్కార్ పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం ట్రాన్స్‌ట్రాయ్‌కు కొన్ని నిధులు విడుద‌ల చేసినా ..ఆ సంస్థ మాత్రం త‌న ఉప కాంట్రాక్ట‌ర్ల‌కు ఎలాంటి నిధులు ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది.

ఈ క్ర‌మంలో తాజాగా ప‌నులు నిలిపివేసిన త్రివేణి సంస్థ ఎస్క్రో అక్కౌంట్ ఓపెన్ చేసి త‌మ చెల్లింపుల‌కు భ‌రోసా క‌ల్పిస్తే త‌ప్ప తాము ప‌నులు చేయ‌లేమ‌ని ప్ర‌భుత్వానికి తేల్చి చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతానికి ప్రాజెక్టు ప‌నులు ఆగిపోవ‌డంతో పోల‌వ‌రం అనుకున్న టైంకు పూర్తి కావ‌డం సందేహంగానే క‌నిపిస్తోంది.

ఇక ఈ ప్రాజెక్టు నిర్మాణ ప‌నులు ద‌క్కించుకున్న ట్రాన్స్‌ట్రాయ్ ముందునుంచి వివాదాల‌కు కేంద్ర‌మ‌వుతోంది. ఇప్పుడు త్రివేణి సంస్థ ప‌నుల ఆపేయ‌డంతో పోల‌వ‌రం ప‌నుల‌కు మ‌ళ్లీ మ‌రోసారి బ్రేక్ ప‌డిన‌ట్ల‌య్యింది. ఏదేమైనా చంద్ర‌బాబు 2019 ఎన్నిక‌ల‌కు ముందుగానే పోల‌వ‌రం ప్రాజెక్టును చాలా వ‌ర‌కు పూర్తి చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని ప్లానింగ్‌తో ఉన్నారు. ఆయ‌న ప్లానింగ్ కేవ‌లం కాగితాల‌కే ప‌రిమిత‌మ‌వుతోంది కాని…ఆచ‌ర‌ణ‌లో మాత్రం అమ‌లు కావ‌డం లేదు.