ప్యాకేజీ పాఠాలు నేర్పనున్న చంద్రబాబు 

కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం అని మాత్రమే ప్రకటన చేసినప్పటికీ, దాన్ని ప్యాకేజీగా చెప్పేసుకుంటూ ఆంధ్రప్రదేశ్‌ అంతా ప్రజలకు పాఠాలు చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సన్నద్ధమయ్యారట. ఓ వైపున పార్టీల పరంగా టిడిపి, బిజెపి ఇప్పటికే ప్యాకేజీ అనబడే సాయంపై ప్రచారం మొదలు పెట్టాయి. ఇంకో వైపున ప్రభుత్వ పరంగా ప్రజలలకు ప్యాకేజీ లాభాల్ని తెలియజెప్పేందుకు రంగం సిద్ధమవుతోంది. పార్టీ ముఖ్య నేతలతోనే కాకుండా, క్యాబినెట్‌లోనూ ఈ అంశాలపైనే ముఖ్యంగా చర్చ జరిగిందని సమాచారమ్‌. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెబుతున్న లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి 2.25 లక్షల కోట్ల విలువైన ప్యాకేజీని (ప్రత్యేక సాయం) కేంద్రం ప్రకటించినట్లు తెలియవస్తోంది.

కానీ, దీనికి సంబంధించి ఎలాంటి చట్టబద్ధతా ఇప్పటివరకూ లేకపోవడంతో దాన్ని పార్టీ పరంగా అయినా ప్రభుత్వం పరంగా అయినా ఎలా ప్రచారం చేయగలమనే సంశయం ఏదో ఒక మూల చంద్రబాబుని వేధిస్తోందట. వీలైనంత త్వరగా ప్యాకేజీకి చట్టబద్ధత ఇప్పించాలని ఇటీవల ఢిల్లీ వెళ్ళినప్పుడు చంద్రబాబు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి సూచించారని సమాచారమ్‌. ఇదిలా ఉండగా, విభజన చట్టాన్ని యధాతథంగా అమలు చేస్తే రెండు లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ వస్తుందనీ, దీనికి ప్రత్యేక హోదా అదనం అనీ, అలాగే బుందేల్‌ ఖండ్‌ తరహా ప్యాకేజీ కూడా ప్రత్యేకం అని ఆంధ్రప్రదేశ్‌లోని విపక్షాలు అంటున్నాయి.