ప్రగతి భవన్.. పార్టీ కార్యాలయమా.. సీఎం గారూ!!

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు అంద‌రికీ భిన్నంగా క‌నిపిస్తున్నారు. తెలంగాణ ఉద్య‌మం కోసం అహ‌ర‌హం శ్ర‌మించి బీదా బిక్కీని సైతం ఆక‌ర్షించి.. ఉద్య‌మం దిశ‌గా న‌డిచిన నేత‌.. ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చాక‌.. సీఎం అంటే ఏమిటో చూపిస్తున్నారు. అయిందానికీ, కానిదానికీ.. త‌న పంత‌మే నెగ్గాల‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం. ఏదైనా సొంత అభిప్రాయ‌లు ఉంటే.. అవి త‌న కుటుంబానికో.. త‌న‌కో ప‌రిమితం కావాలి. కానీ, కేసీఆర్ అలా చేయ‌డం లేద‌ని అనిపిస్తోంది. త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయాల‌ను కూడా రాష్ట్రం మొత్తానికి రుద్దు తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న చేప‌ట్టిన ప‌లు కార్య‌క్ర‌మాలు మ‌న‌కు క‌నిపిస్తున్నాయి.

సీఎంగా హైద‌రాబాద్‌లో నివ‌సించేందుకు వైఎస్ రాజ‌శేఖ‌రెడ్డి హ‌యాంలో క‌ట్టించిన పెద్ద ఇల్లు ఉంది. అది అధికారిక నివాసం. అవి కాకుండా బేగం పేట విమానాశ్ర‌యం వ‌ద్ద సీఎం హౌస్ ఉంది. ఇవ‌న్నీ విశాల‌మైన భ‌వంతులే. అంతేకాకుండా అతిథి గృహాలు, కాన్ఫ‌రెన్స్ హాళ్లు అనేకం ఉన్నాయి. అయితే, వీట‌న్నింటినీ తోసిపుచ్చి దాదాపు 100 కోట్ల వ్య‌యంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ నిర్మించుకున్నారు కేసీఆర్ . దీనిపై అసెంబ్లీలో పెద్ద ఎత్తున దుమారం రేగిన‌ప్పుడు.. ఇది నా ఇల్లు కాదు.. ప్ర‌జ‌ల‌ది! అంటూ ప్ర‌వ‌చించారు. మ‌రి ఆ ప్ర‌జ‌లే క‌ట్టించిన‌వి సీఎం కోసం ఇన్ని ఉండ‌గా కొత్త‌ది ఎందుకు అన్న కోదండ రాం వంటి వారిని కొడుకు, కూతుళ్ల‌తో తిట్టిస్తారు.

ఇక‌, ఇప్పుడు తాజా విష‌యంలోకి వెళ్లిపోతే.. కోట్టు పోసి క‌ట్టించుకున్న‌(ప్ర‌జాధ‌న‌మే లేండి)  ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ని ఇక నుంచి పార్టీ కార్యాల‌యంగా మార్చాల‌ని కేసీఆర్ నిర్ణ‌యించుకున్నారట‌! పైకి మాత్రం ప్ర‌జ‌ల‌తో ముఖా ముఖి పేరిట ఈ భ‌వ‌న్‌లో పెద్ద ఎత్తున స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్టు స‌మాచారం. కానీలోలోన మాత్రం.. 2019 నాటికి పార్టీని బ‌లోపేతం చేసే క్ర‌మంలో ఈ భ‌వ‌న్‌లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని కేసీఆర్ డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే వెయ్యి మంది కూర్చునే సువిశాల ప్రాంగ‌ణాన్ని నిర్మించార‌ట‌. అక్క‌డ ఓ వెయ్యి మంది ప్ర‌జ‌ల‌ను హాజ‌రు ప‌రిచి.. కేసీఆర్ వారితో ముఖాముఖి నిర్వ‌హిస్తార‌ట‌.

దీనివ‌ల్ల ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య బంధం బ‌లోపేతం అవుతుంద‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. ఈ ద‌ర్బారు కోసం త‌ర‌లి వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు దారి ఖర్చులు, భోజ‌న వ‌స‌తులూ స‌ర్కారు వారే క‌ల్పించ‌బోతున్న‌ట్టు స‌మాచారం(సొమ్ము త‌న‌ది కాదు కాబ‌ట్టి..). ఇలా వ‌చ్చే ప్ర‌జ‌ల‌కు ప‌వ‌ర్ పాయింట్ ప్రెజెంటేష‌న్లు చూపిస్తారు, బంగారు తెలంగాణ సాధ‌న దిశ‌గా ముఖ్య‌మంత్రి ఏం చేస్తున్నారో… భ‌విష్య‌త్తులో ఇంకా ఏమేం చేయ‌బోతున్నారో వివ‌రిస్తారు. అలాగే, ప్ర‌జ‌లు ఏం చేయాలో కూడా స‌ద‌రు ప్రెజెంటేష‌న్ల ద్వారా వివ‌రించ‌నున్న‌ట్టు స‌మాచారం. అయితే, దీనికి మ‌రో కోణం కూడా ఉంద‌ని స‌మాచారం. ఈ ముసుగులో రానున్న ఎన్నిక‌ల‌కు పార్టీ కేడ‌ర్‌కి దిశానిర్దేశం చేస్తార‌ట కేసీఆర్‌. సో.. మొత్తానికి జ‌నం సొమ్ముతో పార్టీ ప్ర‌చారానికి ప‌క్కా ప్లాన్ వేశార‌న్న‌మాట.. మాజీ ఉద్య‌మ నేత‌!!