బాబుపై రాజీనామా అస్త్రం ఎక్కుపెట్టిన జ‌గ‌న్‌

ప్ర‌త్యేక‌హోదాపై వెన‌క‌డుగు వేసేది లేదంటున్నారు ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి! ఆరునూరైనా త‌మ ఎంపీలు రాజీనామా చేసి తీర‌తార‌ని స్ప‌ష్టంచేస్తున్నారు. హోదాపై మాట‌మార్చిన బీజేపీ, టీడీపీల‌ను ఇరుకున పెట్టేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు! కేంద్రంతో గొడ‌వ ప‌డేదానికంటే.. రాజీమార్గ‌మే బెట‌ర్ అని సీఎం చంద్ర‌బాబు చెబుతుంటే.. రాజీ కంటే పోరాట‌మే బెట‌ర్ అని జ‌గ‌న్ చెబుతున్నారు. మొత్తానికి త‌మ పార్టీ నేత‌లు రాజీనామా చేస్తార‌ని చెప్పి.. ప్ర‌త్యేక‌హోదా కోసం పోరాడింది తామేన‌ని, టీడీపీ అస‌లు చేసిందేమీ లేద‌ని ప్ర‌జల ముందు టీడీపీని దోషిగా నిల‌బెట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో చంద్ర‌బాబు అండ్ కో కొంత ఇరుకున ప‌డిన‌ట్టే!!

ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేస్తారంటూ మరోమారు స్పష్టం చేసేశారు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఉద్యమం నుంచి వెనక్కి తగ్గేది లేదన్నది ఆయన మాట. ‘ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం.. మార్చి తర్వాత దేశంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా వుండదు..’ అని అటు బీజేపీ, ఇటు టీడీపీ చెబుతున్నా.. ప్రత్యేక హోదా అంశంపై పట్టు వీడబోనని జగన్‌ తెగేసి చెబుతుండడం గమనార్హం. జూన్‌ 2 తర్వాత వైఎస్సార్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని వైఎస్‌ జగన్‌ గతంలోనే ప్రకటించేశారు.

ఇప్పుడు మరోసారి రాజీనామాలపై క్లారిటీ ఇచ్చారు జ‌గ‌న్‌. అయితే, రాజీనామాస్త్రం ఎంత పవర్‌ఫుల్‌.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. తెలంగాణలోలా ఆంధ్రప్రదేశ్‌ ప్రజానీకంలో ఉద్యమాల పట్ల ఆసక్తి అంతగా కన్పించ డంలేదు. అన్నిటికీ మించి, ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఐక్యత.. అనేది కన్పించడంలేదాయె.! తెలంగాణలో పరిస్థితులు వేరు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అన్ని రాజకీయ పార్టీలూ ఒక్కటయ్యాయి. అసలు విభజన జరిగే అవకాశమే లేదన్న పరిస్థితుల నుంచి, విభజన తప్పనిసరి.. అనే పరిస్థితుల్ని తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చింది. మరి ఏపీలో ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ప్రత్యేక హోదా పట్ల అవగాహనగానీ, ఆసక్తిగానీ లేకపోవడం గమనార్హం.

ప్రత్యేక హోదాని అటకెక్కించేసి, ప్రత్యేక ప్యాకేజీ కబుర్లు చెప్పి.. చివరికి ప్రత్యేక సాయం.. అంటూ ముక్తాయింపు నిచ్చింది నరేంద్రమోడీ సర్కార్‌. ఈ మధ్యనే కేంద్ర క్యాబినెట్‌, ఆ సాయానికి ఆమోదం తెలపడంతో, ‘ఇక ఇంతే’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఫిక్సయిపోయారు. ఇక, జగన్‌ రాజీనామాస్త్రాలతో జనంలోకి తన పార్టీని తీసుకెళ్లాలనుకోవడం, ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలనుకోవడం.. ఇవన్నీ రాజకీయ కోణంలో వినడానికి బాగానే ఉన్నా ఎంత‌వ‌ర‌కూ స‌క్సెస్ అవుతాయ‌నేది కాల‌మే నిర్ణ‌యిస్తుంది.