బాబు గ్రేడింగుల లెక్క ఇదే

ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌ర్వేల గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన రెండున్న‌రేళ్ల‌లోనే ఎప్ప‌టిక‌ప్పుడు త‌న మంత్రులు, ఎమ్మెల్యేల మీద స‌ర్వేలు చేస్తూ వారిని అనుక్ష‌ణం అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. బాబు గారి స‌ర్వే లెక్క‌ల‌తో మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఎప్పుడు ఏం కొంప ముంచుకొస్తుందోరా బాబు అని టెన్ష‌న్ టెన్ష‌న్‌గానే ఉంటున్నారు.

ఇక తాజాగా విజ‌య‌వాడ‌కు స‌మీపంలోని వ‌డ్డేశ్వ‌రంలోని కేఎల్ వ‌ర్సిటీలో ఏపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జ్‌ల‌కు మూడు రోజుల పాటు శిక్ష‌ణ త‌ర‌గ‌తులు నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఈ త‌ర‌గతుల అనంత‌రం చంద్ర‌బాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌కు వారి ప‌నితీరుపై సీల్డు క‌వ‌ర్ రిపోర్టులు అంద‌జేశారు.

ఈ సీల్డు క‌వ‌ర్లు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ రిపోర్టులో మొత్తం 8 పేజీలు ఉన్న‌ట్టు తెలుస్తోంది. రిపోర్టు వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తే అందుకు సంబంధిత ఎమ్మెల్యే, ఇన్‌చార్జ్‌ల‌ను బాధ్యులుగా చేస్తామ‌ని చంద్ర‌బాబు హెచ్చ‌రించ‌డంతో ఈ వివ‌రాలు బ‌య‌ట‌కు రాకుండా ఎమ్మెల్యేలు జాగ్ర‌త్త ప‌డుతున్నారు.

ఇక ఈ రిపోర్టులో వారికి వ‌చ్చిన గ్రేడ్ల వివ‌రాల‌తో పాటు వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ స్థితిగ‌తులు, వారు పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు ఎంత వ‌ర‌కు అందుబాటులో ఉంటున్నారు ? ఎమ్మెల్యే అవ్వ‌క ముందు, ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యాక ఎంత తేడాతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న వివ‌రాలు పొందు ప‌రిచార‌ట‌.

టాప్ ప‌నితీరుతో ఉన్న వారికి ఏ గ్రేడ్‌, ఓకే అనుకున్న‌వారికి బీ గ్రేడ్‌, నిర్ల‌ప్త‌తో ఉండి, వెనుక‌బ‌డిన వారికి సీ గ్రేడ్‌, అత్యంత చెత్త ప‌నితీరు క‌న‌ప‌రుస్తున్న వారికి డీ గ్రేడ్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఇక నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జ్‌ల‌లో చాలా మందికి డీ గ్రేడ్ వ‌చ్చింద‌ట‌. వారిలో కొంద‌రిని మార్చేస్తామ‌ని ముందుగానే ఇలా హింట్ ఇచ్చార‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇక మంత్రుల్లో కూడా కొంద‌రికి డీ గ్రేడ్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. కేబినెట్ ప్రక్షాళ‌న‌లో డీ గ్రేడ్ మంత్రుల‌కు ఊస్టింగ్ త‌ప్ప‌ద‌న్న టాక్ కూడా ఈ స‌మావేశాల్లో చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.