బాబు దూకుడుకు బ్రేక్ వేసిన న‌ర‌సింహ‌న్‌

ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించ‌కుండా వారికి మంత్రి ప‌దవుల్ని క‌ట్ట‌బెట్టేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబు స‌న్నాహాలు ప్రారంభిస్తున్న స‌మ‌యంలో.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ గ‌ట్టి షాక్ ఇచ్చారు. త‌న‌లో ఉన్న రెండో కోణాన్ని బ‌య‌ట‌పెట్టారు. రెండేళ్ల క్రితం తెలంగాణ‌లో జ‌రిగిన విష‌యాన్ని నేత‌లు మ‌రిచిపోయినా.. తాను మాత్రం మ‌రిచిపోలేద‌ని స్ప‌ష్టంచేశారు. నాడు రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని కేక‌లు, నిర‌స‌న‌లు, విమ‌ర్శ‌లు చేసిన వారే.. నేడు అదే చేస్తుంటే ఎలా అని ప్ర‌శ్నించారు. వారితో రాజీనామాలు చేయించి.. ఆమోదం పొందిన త‌ర్వాత‌నే.. వాళ్ల‌తో మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయిస్తాన‌ని, లేనిపక్షంలో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌బోన‌ని స్ప‌ష్టం చేశారు.

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు భారీగా చేరిపోయారు. ఆ స‌మ‌యంలో కొంత‌మందికి త‌న మంత్రి వ‌ర్గంలో చోటు కల్పించారు సీఎం కేసీఆర్‌! అప్పుడు టీఆర్ఎస్ నేత‌లు తీవ్రంగా విమ‌ర్శించారు. నేరుగా గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌.. రాజ్యాంగ ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోప‌ణ‌లు చేశారు. ఏపీ మంత్రులు కూడా గవర్నరును ఆడుకున్నారు. అప్పుడు టీఆర్ఎస్‌లో చేరిన విధంగా ఇప్పుడు ఏపీలో టీడీపీలో వైసీపీ ఎమ్మెల్యేలు చేరుతున్నారు. వీరికి కూడా మంత్రి ప‌దవులు ఇవ్వాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.

ఇప్పుడు తన అధికారాలను ఉపయోగించి చంద్రబాబును ఇరుకున పెట్టడానికి న‌ర‌సింహ‌న్‌ రెడీ అవుతున్నారట.ఈ మేరకు ఆయన చంద్రబాబు కేబినెట్లోని ఒక సీనియర్ మంత్రి వద్ద ఈ విషయాన్ని ప్రస్తావించారట. ముందు ఫిరాయింపు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి వాటికి ఆమోదం లభించిన తర్వాతే వారికి మంత్రి పదవులివ్వాలని.. కాదూకూడదని ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులిస్తే వారితో ప్రమాణ స్వీకారం చేయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడమే కాకుండా తన మాటగా చంద్రబాబుకు చెప్పమని కూడా ఆయన అన్నట్లు సమాచారం.

నిజానికి తెలంగాణలో తలసాని విషయంలో టెక్నికల్ గా ఇక్కడే చిన్నచిన్న పొరపాట్లు దొర్లడంతో గవర్నరు అప్పట్లో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. తలసాని మంత్రి పదవి తీసుకోవడానికి ముందే రాజీనామా చేశారు. కానీ.. స్పీకర్ దాన్ని ఆమోదించలేదు. ఆ అంశాన్ని టీడీపీ పదేపదే లేవనెత్తడమే కాకుండా సుప్రీంకోర్టుకు కూడా వెళ్లింది. గవర్నరును దోషిగా చూపి విమర్శలూ చేసింది. దీంతో ఇప్పుడు అదే తప్పు మీరెలా చేస్తారంటూ గవర్నరు ప్రశ్నించారట. మంత్రి ఎవరైనా ముఖ్యమంత్రికి గవర్నరు గట్టి వార్నింగ్ ఇవ్వడం మాత్రం నిజమని సమాచారం.