బాబూ పుష్కర పుణ్యం మాకొద్దు

గత నెల రోజులుగా పాలనా పడకేసిన పట్టించుకోకుండా పుష్కర పనులకే పరిమితమయింది ప్రభుత్వమంతా..అక్కడికేదో చరిత్రలో ఇదే మొదటిసారి పుష్కారాలు అన్నట్టుగా ముఖ్యమంత్రి దగ్గరినుండి మంత్రిమండలి మొదలు అధికార యంత్రాగమంతా పనులుమానుకొని మరీ రాష్ట్రం లో పుష్కరాలు తప్ప వేరే పనిలేదు అన్నట్టుగా హడావిడి చేశారు.ఈ పైత్యం ఏ రేంజ్ కి చేరిందంటే అదేదో ఫామిలీ ఫంక్షన్ అన్నట్టు మంత్రివర్యలచే ఆహ్వానాలు అందిచిందడం ఈ మొత్తం వ్యవహారానికి పరాకాష్ట.

ఏర్పాట్లు అయితే ఘనంగానే చేశారు కానీ జనాలు మాత్రం రావడం లేడు.కృష్ణ పుష్కరాలకు భక్తులు లేక వెలవెలబోతోంది. కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్క ఘాట్ కూడా భక్తులతో కళకళలాడలేదు. భారీగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఘాట్‌లన్నీ ఖాళీగా కనిపించాయి. ఉదయం కొన్ని ఘాట్‌లలో జనం ఒక మోస్తరుగా కనిపించారు. రానురాను భక్తుల సంఖ్య పెరుగుతుందని అనుకుంటే, పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఏ ఘాట్ చూసినా వెలవెలబోతూ కనిపించింది.లక్ష మందికి పైగా ఒకేసారి స్నానం చేసేందుకు వీలుగా పద్మావతి, కృష్ణవేణి ఘాట్‌లను నిర్మించారు. కేవలం పదుల సంఖ్యలో మాత్రమే భక్తులు స్నానాలు ఆచరించారు.

జనాల్లో ఇంకా గోదావరి పుష్కార తాలూకు తొక్కిసలాట మదిలో మెదులుతూనే ఉంది.ఆ భయం వారిని వెంటాడుతూనే ఉంది.అదే అనేకమందిని కృష్ణ పుష్కరాలకు దూరం చేస్తోంది. గోదావరి పుష్కరాల సందర్భంగా తొలి రోజు తొక్కిసలాటలో పదుల సంఖ్యలో చనిపోయిన సంగతి తెలిసిందే. మరోపక్క విజయవాడలో ఏర్పాట్లపై ప్రజల్లో అనుమానం ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రాలేదని చెపుతున్నారు.అదీకాక పట్టిసీమ ద్వారా గోదావరి జలాల్ని కృష్ణా లో కలపడం ద్వారా కృష్ణ పుష్కర పవిత్రత కోల్పోయిందని వాదన కూడా ప్రజల్లోకి బలంగా వెళ్లడం మరొక కారణంగా కనిపిస్తోంది.

రానున్న మూడు రోజుల్లో పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. శనివారం సెకెండ్ సాటర్‌డే, ఆదివారం, సోమవారం ఆగస్ట్ 15 కావడంతో వరుసగా మూడు రోజులు సెలవలు వచ్చాయి. దీంతో భారీ సంఖ్యలో భక్తులు పుష్కరాలకు తరలి వస్తారని భావిస్తున్నారు.అయినా దేవాదాయ శాఖ ఉంది దానికి అధికార యంత్రంగం ఉంది దానికో మంత్రి అఘోరించాడు వాళ్ళ మానాన వాళ్ళ పనులు చూసుకుంటే సరిపోతుంది.అది లేదు మొత్తం నేనే చేస్తా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి దాంట్లో దూరడం ఏంటో ఎవరికీ అర్థం కాదు.ఇక జనాల్ని కూడా పుష్కరాలకు తరలిస్తారేమో పాపం.

పుష్కరాలనేవి ఓ ఆధ్యాత్మిక కార్యక్రమం లో భాగమైనవి.ఎవరెవరి నమ్మకానికి తగ్గట్టు వాళ్ళు ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతారు.అది వదిలి ప్రభుత్వ ప్రచారం ఏంటో అంతుపట్టదు.రాష్ట్రము లో ఎన్నో సమస్యలు తిష్టవేసిన ఈ తరుణం లో ఇంత ప్రచార ఆర్బాటం దేనికి.ఎవరిని ఉద్దరించడానికి ఈ ప్రచారాలు..పర్యవేక్షణలు..ఆహ్వానాలు..