బీజేపీ నేతల ఎత్తుగడలను అనిచివేసే పనిలో కెసిఆర్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల అనంత‌రం బీజేపీ అధిష్ఠానం ద‌క్షిణాధి రాష్ట్రాల‌పై పూర్తిగా దృష్టిసారించింది. ఇందులో భాగంగా ముందుగా తెలంగాణపై పూర్తిగా ఫోక‌స్ పెట్టిన‌ట్టు వార్త‌లు గుప్పుమంటున్నాయి. ఈ వ్యాఖ్య‌ల‌ను మొద‌ట ప‌ట్టించుకోక‌పోయినా.. ఇప్పుడు మాత్రం వీటిని సీరియ‌స్‌గా తీసుకుంటున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్‌! అంతేగాక బీజేపీ దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌టంతో.. ఆయ‌న‌లో గుబులు మొద‌లైంద‌ట‌. దీంతో బంగారు తెలంగాణ నినాదంతో బలపడుతున్న గులాబీ పార్టీ నేతలకు ఊహించని రాజకీయ పరిణామాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీ వ్యూహాల‌కు చెక్ పెట్టేలా ప్ర‌తి వ్యూహాలు ర‌చించే ప‌నిలో ప‌డ్డారు కేసీఆర్‌!!

గులాబీ పార్టీకి కమలం గుబులు పట్టుకుంది. యూపీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి మరింత ఉత్సాహాన్ని ఇచ్చాయి. ఇక ఉత్తర భారతంలో పట్టు సాధించిన బీజేపీ.. ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారించింది. ఏపీలో తమ మిత్రపక్షమైన టీడీపీయే అధికారంలో ఉండడంతో.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టారు. ఓ వైపు దేశవ్యాప్తంగా బీజేపీ బలపడుతుంటుంటే.. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు గుబులు పట్టుకుంది. దీంతో టీఆర్‌ఎస్‌ నేతలు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తమకు తిరుగులేదని, త‌ప్పక అధికారంలోకి వ‌స్తామ‌ని సీఎం కేసీఆర్‌.. ధీమాగా ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం బీజేపీ నాయ‌కులు.. కేసీఆర్‌ను టెన్ష‌న్ పెడుతున్నారు. తెలంగాణ‌లో టీఆర్ఎస్‌తో దోస్తీనా.. లేక వైర‌మా అనే విష‌యంపై బీజేపీ నాయకులు స్పష్ట‌త ఇవ్వ‌డంతో.. రాష్ట్ర బీజేపీ నేత‌లు దూకుడు పెంచారు. ఇదే స‌మ‌యంలో కమలనాథుల ఎత్తులకు పైఎత్తులు వేసేందుకు కేసీఆర్ తీవ్ర‌ కసరత్తు చేస్తున్నారు. తెలంగాణలోని 17 పార్లమెంట్‌ స్థానాల్లోని ఏడు స్థానాలను టార్గెట్‌ చేసుకుని.. ఆ పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలోని శాసనసభ స్థానాలపై దృష్టి పెట్టాలని బీజేపీ నేతలు స్కెచ్‌ వేశారు. కేంద్ర మంత్రులను రంగంలోకి దించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు.

టీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ దృష్టి పెట్టడంతో టీఆర్‌ఎస్‌లో గుబులు మొదలైంది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న గులాబీ దళపతి.. బీజేపీ కార్యక్రమాలపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. బీజేపీ అనుబంధ సంఘాలైన ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పి, భజరంగ్‌దళ్‌ లాంటి సంస్థలపై కూడా టీఆర్‌ఎస్‌ కన్నేసింది. ఇప్పటికే సర్వేలతో నేతలను అప్రమత్తం చేస్తున్న కేసీఆర్‌… పార్టీ బలోపేతంపై సీరియస్‌గా ఉన్నారు. మ‌రి త్వ‌ర‌లో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు ఏవిధంగా మార‌తాయో వేచిచూడాల్సిందే!