బ్రెగ్జిట్ బాంబ్ -మార్కెట్ క్రాష్

యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకోవడంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. దాంతోపాటు బ్రిటిష్ కరెన్సీ పౌండ్ విలువ కూడా ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంత దారుణంగా పడిపోయింది. గత 31 ఏళ్లలో అత్యంత దిగువ స్థాయికి పౌండ్ పడిపోయింది. 10 శాతానికి పైగా నష్టాన్ని చవిచూసింది. వాస్తవానికి బ్రిటిష్ ప్రజలు యూరోపియన్ యూనియన్ లో ఉండటానికే మొగ్గు చూపిస్తారని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో వెళ్లిపోవాలని ఓటు వేయడంతో మార్కెట్లు తీవ్రంగా పతనమయ్యాయి.
నిన్నటి వరకు పౌండుకు 1.50 డాలర్లు వస్తే, ఇప్పుడు కేవలం 1.35 డాలర్లు మాత్రమే వస్తున్నాయి. రూపాయి విలువతో పోల్చి చూసినపుడు కూడా పౌండు విలువ పడిపోయింది. నిన్నటి వరకు సుమారుగా ఒక పౌండుకు 98-99 రూపాయల వరకు వస్తుండగా, ఇప్పుడు 91.34 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. పౌండు విలువ పడిపోవడంతో ఆ ప్రభావం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ మీద కూడా దారుణంగా ఉంటుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. బ్రిటిషర్ల నిర్ణయం అంతర్జాతీయ మార్కెట్ల మీద కూడా గట్టిగానే కనిపించింది. భారత స్టాక్ మార్కెట్ ఓ దశలో వెయ్యి పాయింట్ల వరకు నష్టపోగా జపాన్ మార్కెట్లలో అయితే 10 నిమిషాల పాటు ట్రేడింగ్ నిలిపివేశారు.