బ్రెగ్జిట్ బాంబ్ -మొదటి వికెట్ పడింది!!

యురోపియ‌న్ యూనియ‌న్‌తో 43 ఏళ్ల బంధాన్ని తెంచుకోబోతోంది యునైటెడ్ కింగ్‌డ‌మ్‌. చారిత్రక రెఫ‌రెండ‌మ్‌లో బ్రిట‌న్ ప్రజ‌లు విడిపోవ‌డానికే ప‌ట్టం క‌ట్టారు. 51.9 శాతం మంది ఈయూని వీడాల‌ని ఓటేయ‌గా, 48.1 శాతం మంది క‌లిసుండ‌టానికి మ‌ద్దతు తెలిపారు. మొత్తంగా విడిపోవాలని కోటి 74 లక్షల 10 వేల 742 మంది ఓటేయగా, కలిసుండాలని కోటి 61 లక్షల 41 వేల 241 మంది కోరుకున్నారు. లండన్, స్కాట్లాండ్ క‌లిసుండాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌గా, వేల్స్‌తోపాటు ఇత‌ర ఇంగ్లిష్ షైర్స్ బ్రెగ్జిట్‌కే ఓటేశాయి. ఫ‌లితాలు స్పష్టం కావ‌డంతో పౌండ్ విలువ భారీగా ప‌త‌న‌మైంది. తొలి ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే పౌండ్ విలువ డాల‌ర్‌తో 3 శాతం, యూరోతో 6.5 శాతం ప‌త‌న‌మ‌వ‌డం మొద‌లైంది. దీంతో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ క‌లుగ‌జేసుకోవాల్సి వ‌చ్చింది. 1985 త‌ర్వాత అమెరికన్ డాల‌ర్‌తో పోలిస్తే పౌండ్ విలువ క‌నిష్ఠానికి చేరింది. బ్రెగ్జిట్ ప్రభావం ప్రపంచ మార్కెట్ల‌పై తీవ్రంగా ఉంది.

ఈ చారిత్రక రెఫ‌రెండ‌మ్‌లో మూడు కోట్ల‌కు పైగా ఓట‌ర్లు పాల్గొన్నారు. మ్యాజిక్ ఫిగ‌ర్ కోటి 68 ల‌క్షల ఓట్ల‌ను బ్రెగ్జిట్ సునాయాసంగా దాటేసింది. తొలి ఫ‌లితం నుంచి చివ‌రి దాకా విడిపోవ‌డానికే యూకే ప్రజ‌లు మొగ్గు చూపిన‌ట్లు స్పష్టంగా క‌నిపించింది. యూకే ఇండిపెండెన్స్ పార్టీ లీడ‌ర్ నిగెల్ ఫారేజ్ దీనిని బ్రిట‌న్ స్వ‌తంత్ర దినంగా అభివ‌ర్ణించారు. యూకే యురోపిన్ యూనియ‌న్ నుంచి విడిపోవాల‌ని ఆయ‌న 20 ఏళ్లుగా ప్ర‌చారం చేస్తున్నారు. ఇది సామాన్యుల విజ‌యం అని ఆయ‌న తుది ఫ‌లితాల త‌ర్వాత వ్యాఖ్యానించారు. చ‌రిత్రలో జూన్ 23 బ్రిట‌న్ ఇండిపెండెన్స్ డేగా నిలిచిపోతుంద‌ని ఆయ‌న అన్నారు. యురోపియ‌న్ యూనియ‌న్ నుంచి వైదొల‌గ‌బోయే తొలి దేశంగా బ్రిట‌న్ నిల‌వ‌బోతోంది. అయితే ఇప్పటికిప్పుడే బ్రిట‌న్ ఈయూ నుంచి త‌ప్పుకున్నట్లు కాదు. ఈ ప్రాసెస్‌కు క‌నీసం రెండేళ్లయినా ప‌డుతుంది. ప్రధాని కామెరాన్ లిస్బన్ ఒప్పందంలోని ఆర్టిక‌ల్ 50ని ఎప్పుడు ప్రయోగించాలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ఒప్పందం ప్రకారం బ్రిట‌న్ మ‌ళ్లీ ఎప్పుడైనా క‌ల‌వాల‌నుకుంటే అన్ని స‌భ్య దేశాల అంగీకారం అవ‌స‌ర‌మ‌వుతుంది. ఒక‌వేళ బ్రిట‌న్ విడిపోవాల‌ని ఓటేస్తే తాను ఆర్టిక‌ల్ 50ని ప్రయోగిస్తాన‌ని కామెరాన్ ముందే ప్రక‌టించారు.

బ్రిట‌న్ ప్రజ‌లు యురోపియ‌న్ యూనియ‌న్ నుంచి వైదొల‌గ‌డానికే మొగ్గు చూప‌డంతో ప్రధాన‌మంత్రి డేవిడ్ కామెరాన్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేస్తున్నట్లు ప్రక‌టించారు. బ్రెగ్జిట్ తుది ఫ‌లితాలు వెలువ‌డిన త‌ర్వాత ఆయ‌న జాతినుద్దేశించి ప్రసంగించారు. బ్రిట‌న్ ఈయూలోనే కొన‌సాగాల‌ని ఆయ‌న గట్టిగా ప్రచారం చేశారు. కానీ మెజార్టీ ప్రజ‌లు ఆయ‌న ఆకాంక్షకు వ్య‌తిరేకంగా ఓటేశారు. బ్రిట‌న్ ప్రజ‌ల తీర్పును తాను శిర‌సావ‌హిస్తున్నాన‌ని కామెరాన్ ప్రక‌టించారు. ఈ ఫ‌లితాల‌ను తేలిగ్గా తీసుకోవ‌డం లేద‌ని అన్నారు. ప‌ద‌వి నుంచి వైదొలిగినా బ్రిట‌న్ ఒంట‌రిగా నిల‌దొక్కుకోవ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తాన‌ని ఆయ‌న చెప్పారు. ఇంత‌కాలం ప్రధానిగా ప‌నిచేసినందుకు గ‌ర్వంగా ఉంద‌ని కామెరాన్ అన్నారు. ఈయూతో మ‌ళ్లీ సంప్రదింపుల కోసం ఉద్దేశించిన లిస్బ‌న్ ఒప్పందంలోని ఆర్టిక‌ల్ 50ని తాను ప్ర‌యోగించ‌బోన‌ని, కొత్త ప్రధానే ఆ ప‌ని చేస్తార‌ని స్పష్టంచేశారు. అక్టోబ‌ర్‌లో క‌న్జ‌ర్వేటివ్ పార్టీ కాన్ఫరెన్స్ మొద‌ల‌య్యేలోపు కొత్త ప్రధాని బాధ్యత‌లు చేప‌ట్టేలా చూస్తామ‌ని ఆయ‌న అన్నారు. ఈయూ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌ర్వాత కూడా బ్రిట‌న్ సొంతంగా నిల‌దొక్కుకోగ‌ల‌ద‌న్న న‌మ్మకం త‌న‌కుంద‌ని కామెరాన్ చెప్పారు.