భారత్ ఓడి గెలిచింది-చైనా గెలిచి ఓడింది

గెలిచినట్టు భావిస్తున్న చైనా నిజంగా ఓడిపోయింది. వైఫల్యం పొందినట్టు ప్రచారానికి గురి అవుతున్న మన దేశం విజయం సాధించింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జరిగిన అణు సరఫరాల కూటమి-ఎన్‌ఎస్‌జి-సర్వ ప్రతినిధి సమావేశంలో చైనా ఒంటరి అయిపోవడం చైనాకు సంభవించిన దౌత్య పరాజయం. చైనా తప్ప కూటమిలోని మిగిలిన దేశాలు దేశానికి బాసటగా నిలబడడం సాధించిన వ్యూహాత్మక విజయం. ఇన్ని దేశాలు మనకు మద్దతు పలికినప్పటికీ ఎన్‌ఎస్‌జిలో మనకు సభ్యత్వం దక్కకుండా చైనా అడ్డుకుంది. ఇలా అడ్డుకోగలగడానికి ఎన్‌ఎస్‌జి నియమావళి మాత్రమే కారణం. కూటమిలో అన్ని దేశాలూ అంగీకరించినప్పుడు మాత్రమే కొత్తదేశాలకు కూటమిలో సభ్యత్వాన్ని ఇవ్వాలన్నది ఈ నిబంధన…చైనా అంగీకరించలేదు. అందువల్ల మనకు సభ్యత్వం రాలేదు.

కానీ జూన్ 23వ తేదీన మొదటి రోజు సమావేశం తరువాత మరో ప్రత్యేక సమావేశం జరిపి మన ప్రవేశం గురించి సభ్యదేశాలు చర్చించాయి. ఇలా ప్రత్యేక సమావేశం జరపాలన్న మన విదేశ మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్, ఇతర ప్రతినిధులు చేసిన విజ్ఞప్తిని కూటమి అంగీకరించడం చైనా దౌత్యానికి జరిగిన శృంగభంగం. 24వ తేదీన జరిగిన రెండవ నాటి సమావేశాలలోను కూడ చైనా మనదేశ ప్రవేశానికి వ్యతిరేకతను ప్రదర్శించింది, విద్వేషాన్ని వెళ్లగక్కింది. ఆసియాలో మన దేశం చైనాకు ప్రత్య్రామ్నాయ రాజకీయ, ఆర్థిక, రక్షక, సాంస్కృతిక శక్తిగా ఎదిగిపోతుండడం వర్తమాన చరిత్ర. అందువల్ల చైనా కళ్లు మరింత ఎఱుపెక్కుతున్నాయి. చైనా అంగీకరించి ఉండినట్టయితే అంగీకరించని మరో ఐదు దేశాలు సైతం మనకు మద్దతు పలికి ఉండేవి. సర్వసమ్మతి ఏర్పడి ఉండేది. మనకు సభ్యత్వం లభించి ఉండేది. కానీ చైనా తాను వ్యతిరేకించడమే కాక మరో ఐదు దేశాలను సైతం మనకు వ్యతిరేకంగా నిలబెట్టగలిగింది. దక్షిణ అమెరికా ఖండానికి చెందిన బ్రఝిల్-బ్రెజిల్-ఆసియాకు చెందిన టర్కీ, ఆస్ట్రేలియా ఖండానికి చెందిన న్యూజిలాండ్, ఐరోపాలోని ఆస్ట్రియా, ఐర్లాండ్ దేశాలు ప్రత్యక్షంగాను, పరోక్షంగాను చైనాకు వంత పాడాయి.

గతంలో 2008లో అమెరికాతో మనకు కుదిరిన శాంతి ప్రయోజన అణు సహకార అంగీకారానికి పూర్వరంగంగా ఎన్‌ఎస్‌జి మినహాయింపు అనుమతి అవసరమైంది. ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం లేని మన దేశంతో సభ్యదేశమైన అమెరికా ఒప్పందం కుదుర్చుకోరాదన్నది నిబంధన. ఈ నిబంధన నుండి ఎన్‌ఎస్‌జి మనకు మినహాయింపును ఇవ్వాలని మనదేశం అప్పుడు కోరింది. చివరికి ఎన్‌ఎస్‌జి మనకు మినహాయింపును ఇవ్వడానికి అంగీకరించింది, కానీ చర్చల దశలో ఆస్ట్రియా, న్యూజిలాండ్, స్విట్జర్లాండ్ దేశాలు మినహాయింపును వ్యతిరేకించాయి. చైనా అప్పుడు మనతో ప్రచ్ఛన్న యుద్ధం చేసింది, ఇప్పుడు బహిరంగ యుద్ధాన్ని ప్రకటించింది!

గతరెండేళ్లుగా మన దేశానికి ఆసియాలోను అంతర్జాతీయంగాను ప్రాధాన్యం పెరుగుతుండడమే ఈ బహిరంగ శత్రుత్వానికి కారణం! ద్వైపాక్షిక సంబంధాలలో సైతం మన దేశం చైనాతో మునుపటి నంగినంగిగా నీళ్లు నమిలే విధానాన్ని పాటించడం లేదు. చైనా వ్యూహాత్మక దురాక్రమణను, బహిరంగ దురాక్రమణను మన ప్రభుత్వం ప్రతిఘటించడం ఆరంభమైంది. బర్మాలో తలదాచుకుంటున్న చైనా తొత్తులను మన సైనిక దళాలు పట్టి పరిమార్చడం ఇందుకు ఒక ఉదాహరణ. చైనా ప్రేరిత సాయుధ హంతకులను మట్టుపెట్టడానికై మన దళాలు బర్మాలోకి చొచ్చుకుని పోవడం పాకిస్తాన్‌కు సైతం గుబులుపుట్టించింది! బర్మాలో నక్కి మన దేశంలోకి చొరబడి బీభత్స కాండ జరిపిన హంతకులతో తమకు సంబంధం లేదని ఆ తరువాత చైనా ప్రభుత్వం వివరణ ఇచ్చింది. పాకిస్తాన్‌లో గ్వాడార్ ఓడరేవును యుద్ధస్థావరంగా తీర్చిదిద్దడానికి పాకిస్తాన్ పదేళ్లకుపైగా కృషి చేసింది. సమీపంలోని ఇరాన్ ఓడరేవు చౌబుహార్‌ను ఆధునీకరించడానికి ప్రభుత్వం ఇటీవల రంగంలోకి దిగడం మన ప్రతిఘటనకు మరో నిదర్శనం… దశాబ్దల పాటు చైనా సైనికులు వాస్తవ అధీన రేఖ-లైన్ ఆఫ్ యాక్యువల్ కంట్రోల్-ఎల్‌ఏసి-ను దాటివచ్చి మన భూభాగాలలో తిష్ఠ వేస్తున్నాయి. చొరబాటుదారులు భూభాగంలో గుడారాలు వేసి వంటలు చేసి భోంచేసేవారు. వారాల తరబడి తిష్ఠ వేసి మళ్లీ తమ భూభాగంలోకి తిరిగి వెళ్లేవారు. కానీ గత రెండేళ్లుగా చొరబడుతున్న చైనా సైనికులను మన సైనికులు రేఖ ఆవలకు నెట్టివేస్తున్నారు. ఇదంతా చైనా వారు బహిరంగంగా మనపై దౌత్యపరమైన దాడులను ఆరంభించడానికి పూర్వ రంగం…చైనా ముసుగును తొలగించింది.

సియోల్‌లో ఎన్‌ఎస్‌జి సమావేశాలు జరిగిన సమయంలోనే ఉఝబెకిస్తాన్ రాజధాని తాష్కెంట్‌లో షాంఘయి సహకార దేశాల సమాఖ్య-ఎస్‌సిఓ-శిఖరాగ్ర సభ జరిగింది. ఈ సమావేశానికి హాజరైన మన ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు ఝీజింగ్‌పింగ్‌తో చర్చ లు జరిపారు. కానీ చర్చల తరువాత చైనా ప్రభుత్వ వ్యతిరేకత సడలిపోలేదు. ఇలా సడలిపోకపోవడం ఆశ్చర్యకరం కాదు. ఎన్‌ఎస్‌జిలో మాత్రమే వివిధ అంతర్జాతీయ కూటమిలో మనప్రవేశాన్ని చైనా నిరోధిస్తుండడం దశాబ్దుల ప్రహసనం. ఆసియాన్-ఆగ్నేయ ఆసియా దేశాల కూటమితో కలిసి మరో మూడు ప్రధాన ఆసియా దేశాలు విస్తృత సమాఖ్యగా ఏర్పడి ఉన్నాయి. జపాన్, దక్షిణ కొరియా, చైనా దేశాలు ఈ విస్తృత సమాఖ్యలో ఉన్నాయి. ఆసియాన్ మరో మూడు-ఆసియాన్ ప్లస్ త్రి-గా ఈ విస్తృత సమాఖ్య చెలామణి అవుతోంది. ఈ విస్తృత సమాఖ్యలో మన దేశాన్ని చేర్చుకుని ఆసియాన్ మరో నాలుగు దేశాల బృహత్ సమాఖ్యగా ఏర్పడాలన్న ప్రతిపాదనను చైనా వ్యతిరేకిస్తోంది. ఆసియా ప్రశాంత సాగర ప్రాంత దేశాల సమాఖ్యలో కూడ మన దేశం చేరకుండా చైనా అడ్డుపడుతోంది. ఐక్యరాజ్యసమితిలో ఈకమ్యూనిస్టు చైనాకు 1962 వరకు సభ్యత్వం లేదు. కానీ ఆ సమయంలో చైనాకు సభ్యత్వం ఇప్పించడానికి అప్పటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ అహర్నిశలు అంతర్జాతీయ కృషి చేసారు. ఈ కృషికి మనకు దక్కిన ఫలితం 1962లో చైనా పొడిచిన వెన్నుపోటు…చైనా మన భూభాగాలను దురాక్రమించింది.