మంచు బ్రదర్స్ పరాజయాలకు కారణాలు ఎన్నో!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి మంచి ఇమేజ్ , క్రేజ్ రెండూ ఉన్నాయి. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు పేరు చెపితే ఇండ‌స్ట్రీ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటిది ఇప్పుడు మోహ‌న్‌బాబు వార‌సులు మంచు బ్ర‌ద‌ర్స్ అయిన మంచు మ‌నోజ్‌, మంచు విష్ణు ఒక‌రితో మ‌రొక‌రు పోటీప‌డుతూ వ‌రుస డిజాస్ట‌ర్లు ఇస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో వీరిద్ద‌రికి స‌క్సెస్ అంద‌ని ద్రాక్ష అయ్యింది.

ఈ యేడాది జ‌న‌వ‌రిలో విష్ణు ల‌క్కున్నోడుతో డిజాస్ట‌ర్ ఇచ్చాడు. ఆ సినిమా థియేటర్ల రెంట్లు కూడా రాబ‌ట్టుకోలేక‌పోయింది. ఇక గుంటూరోడుతో వ‌చ్చిన మ‌నోజ్ సైతం ప్లాప్‌నే ఎదుర్కొన్నాడు. కాక‌పోతే ల‌క్కున్నోడు కంటే గుంటూరోడు కాస్త బెట‌ర్ అంతే. గ‌తేడాది మ‌నోజ్ శౌర్య – ఎటాక్ లాంటి రెండు ఘోర‌మైన డిజాస్ట‌ర్లు ఇచ్చాడు. ఇప్పుడు గుంటూరోడుతో సైతం మ‌నోడి త‌ల‌రాత మార‌లేదు.

ఇక విష్ణుకు మ‌ధ్య‌లో రాజ్ త‌రుణ్‌తో క‌లిసి చేసిన మ‌ల్టీస్టార‌ర్ ఈడోర‌కం-ఆడోరకం మిన‌హాయిస్తే గ‌త ఆరేడు సినిమాల్లో అన్ని ప్లాపులే అయ్యాయి. ఇక మోహన్‌బాబు వారసులుగా వెండితెరకు పరిచయమైన మంచు బ్రదర్స్‌కు వరుసగా నెగిటివ్‌ ఫలితాలు రావడానికి కథాలోపమే కారణం అని స్పష్టమవుతోంది. ఏకపక్ష నిర్ణయాలు, ఓవ‌ర్ కాన్పిడెన్స్ వాళ్ల కొంప ముంచుతున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇక వీళ్ల కంటే వీళ్ల సోద‌రి మంచు ల‌క్ష్మి చేసిన దొంగాల మంచి లాభాలు తీసుకొచ్చింది. మంచు బ్ర‌ద‌ర్స్‌కు గ‌తంలో మంచి హిట్ సినిమాలే వ‌చ్చాయి. అయితే ఆ త‌ర్వాత వారు ట్రాక్ త‌ప్పారు. పైన చెప్పిన కార‌ణాలే వాళ్లు వ‌రుస‌గా డిజాస్ట‌ర్లు ఇచ్చేందుకు కార‌ణ‌మ‌న్న‌దే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ప్ర‌ధాన చ‌ర్చ‌.