మంత్రి ఒత్తిడితో ఆయన్ను పక్కన పెట్టిన బాబు

రాజ‌కీయాల‌న్నాక ఎప్పుడు ఏం జ‌రుగుతుందో చెప్ప‌డం అంత వీజీకాదు! అంతా అయిపోయింది అనుకున్న త‌రుణంలో ఏమీ కాకుండాను ఉండిపోవ‌చ్చు.. ఏమీ కావ‌డం లేదు.. అనుకుంటున్న త‌రుణంలో ఊహించిన దానిక‌న్నా ఎక్కువ ఫ‌లిత‌మూ రావొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? అక్క‌డికే వద్దాం.. కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌గా, క‌డ‌ప జిల్లా మైదుకూరు నుంచి రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పిన డీఎల్ ర‌వీంద్రారెడ్డి.. ప్ర‌జా క్షేత్రం నుంచి దూర‌మై దాదాపు మూడేళ్ల‌దాకా అవుతోంది. అయితే, ఇప్పుడు తాజాగా ఆయ‌న మ‌రోసారి సెంట‌ర్ ఆఫ్‌ది టాక్‌గా మారారు. 2019 ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు తెర‌చాటున ఉండిపోయి ఇప్ప‌డిప్పుడే తెర‌మీద‌కి వ‌స్తున్న నేత‌ల మాదిరిగానే డీఎల్ కూడా తెర‌మీద‌కి వ‌చ్చారు.

దీంతో ఇప్పుడు డీఎల్ చుట్టూ పొలిటిక‌ల్ చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. క‌డ‌ప నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన డీఎల్‌.. ఏనాడూ వైఎస్‌తో క‌లిసి ఉన్న‌దే లేదు. వైఎస్ ప్ర‌భుత్వంలో ఉండ‌గా.. స్వ‌ప‌క్ష‌మే అయిన‌ప్ప‌టికీ విప‌క్షం మాదిరిగా వ్య‌వ‌హ‌రించి అప‌ఖ్యాతి మూట‌గ‌ట్టుకున్నారు డీఎల్‌. ఇక‌, వైఎస్ త‌న‌యుడు స్థాపించిన ప‌త్రికను సైతం నిత్యం తిట్టిపోయ‌డ‌మే పనిగా పెట్టుకున్నారు. ఆ త‌ర్వాత వైఎస్ దుర్మ‌ర‌ణం పాల‌వ‌డంతో సీఎం సీటు ఎక్కిన కిర‌ణ్ కుమార్ రెడ్డితో చెలిమి చేసి.. మంత్రి వ‌ర్గంలో సీటు సంపాదించారు. కొన్నాళ్లు బాగానే ప‌నిచేసినా..ఆ తర్వాత వివాద‌మ‌య్యారు.

దీంతో కిర‌ణ్ కుమార్ రెడ్డి డీఎల్‌ని మంత్రివ‌ర్గం నుంచి అనూహ్యంగా తొల‌గించారు. ఇక‌, ఆ త‌ర్వాత రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్ చీలిపోవ‌డం, నేత‌లు ఎవ‌రికివారే అన్న‌ట్టుగా మారిన నేప‌థ్యంలో డీఎల్‌.. ఆ పార్టీ నుంచి త‌ప్పుకొని వేరే పార్టీలోకి జంప్ చేయాల‌ని య‌త్నించారు. ఈ క్ర‌మంలో డీఎల్‌ని టీడీపీలోకి తీసుకునేందుకు మంత‌నాలు సాగాయి. ఇక‌, రేపో మాపో చంద్ర‌బాబు స‌మ‌క్షంలో డీఎల్ సైకిల్ ఎక్క‌డం ఖాయ‌మ‌ని అంద‌రూ భావించారు. మ‌రో వారం ప‌దిరోజుల్లో చంద్ర‌బాబు స‌మ‌క్షంలో డీఎల్ టీడీపీ గూటికి చేర‌తార‌ని అనుకున్నారు. కానీ, ఇంత‌లోనే డీఎల్ టీడీపీ ఎంట్రీకి బ్రేక్ ప‌డింద‌ని స‌మాచారం.

డీఎల్‌.. టీడీపీలోకి వ‌స్తాన‌ని చెప్పినా ఇప్పుడు ఆయ‌న‌కు ఎంట్రీ అంత వీజీ కాద‌నే టాక్ న‌డుస్తోంది. మైదుకూరు నుంచి డీఎల్ వ‌చ్చి టీడీపీలో చేరితే… టీడీపీ ఇంఛార్జ్‌గా ఉన్న పుట్లా సుధాక‌ర్ యాద‌వ్ భ‌విత‌వ్యంపై పెద్ద ప్ర‌భావం ప‌డుతుంద‌ని భావిస్తున్నార‌ట‌. వాస్త‌వానికి మైదుకూరు ఎమ్మెల్యే సీట‌ను ఇప్ప‌టికే సుధాక‌ర్‌కి ఇప్పించాల‌ని ఆర్థిక‌ మంత్రి, టీడీపీలో మంచి ప‌ట్టున్న మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు తెర వెనుక చ‌క్రం తిప్పుతున్నార‌ట‌! దీంతో డీఎల్ టీడీపీ ఎంట్రీపై అనేక మేఘాలు ముసురుకున్నారు. మ‌రోప‌క్క‌, సుధాక‌ర్‌.. య‌న‌మ‌ల ఇద్ద‌రు వియ్యంకులు కావ‌డంతో య‌న‌మ‌ల అన్ని విధాలా సుధాక‌ర్‌కి స‌హ‌క‌రిస్తున్నార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో త‌న‌కు టీడీపీలో చేరాల‌ని ఉన్నా.. ఆ పార్టీ నుంచి ఎలాంటి సంకేతాలూ రాక‌పోవ‌డంపై గుర్రుగా ఉన్న ర‌వీంద్ర‌.. త్వ‌ర‌లోనే వైకాపా అధినేత జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైకాపా తీర్థం పుచ్చుకుంటార‌ని తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.