మంత్రి పై బాబుకు ఇంటిలిజెన్స్ రిపోర్ట్

ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్య‌వ‌హారం చినికి చినికి గాలి వాన‌గా మారుతోంది. గుంటూరు జిల్లా జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ జానీమూన్‌, ఆయ‌న‌కు మ‌ధ్య విభేదాలు మ‌రువక ముందే మ‌రో వివాదంలో ఆయ‌న చిక్కుకున్నారు! ఆయ‌న వ్య‌వ‌హారం పార్టీ అధినేత‌కు తీవ్ర త‌ల‌నొప్పిగా మారింది. వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారుతున్న రావెల‌పై.. ఇంటెలిజెన్స్ విభాగం ఒక నివేదిక‌ను రూపొందించింద‌ని స‌మాచారం! ఇప్పుడు దీనిని సీల్డ్ క‌వ‌ర్‌లో అధినేత చంద్ర‌బాబుకు అంద‌జేసిన‌ట్లు తెలుస్తోంది! దీంతో ఇక మంత్రిపై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని సీఎంవో వ‌ర్గాల స‌మాచారం!!

గుంటూరు జిల్లాలో మంత్రి రావెల తీరు వివాదాస్ప‌దంగా మారుతోంది. పార్టీలో ఉన్న‌వారి కంటే కొత్త‌గా వ‌చ్చిన వారికి ఆయ‌న ప్రాధాన్యత ఇస్తుండ‌టంతో అటు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు తీవ్రంగా మండిప‌డుతున్నారు. అలాగే జడ్పీ ఛైర్ పర్సన్ జానీమూన్, కిషోర్‌బాబు మధ్య ఏర్పడిన వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. దీనిపై చంద్రబాబు కూడా ఆగ్రహం వ్య‌క్తంచేసి.. ఒక త్రిసభ్య కమిటీని నియమించి విచారణ చేయించారు. అయితే కొన్ని గంట‌ల సేపు అటు సెక్యూరిటీని ప‌క్క‌న పెట్టి.. మ‌రీ అదృశ్య‌మవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. సమన్వయ కమిటీ సమావేశం జరిగే ముందు రోజే రావెల కిషోర్ త‌న గన్‌మెన్‌ను వదిలేసి, వాహనాన్ని స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ ఎటో వెళ్ల‌డం క‌ల‌క‌లం సృష్టించింది.

మంత్రి క‌నిపించక‌పోవ‌డంతో ఆందోళనకు గురైన గ‌న్‌మెన్ ఉన్న‌తాధికారుల‌కు వెంట‌నే ఈ విష‌యాన్ని చేర‌వేశారు.  మూడున్నర గంటల తర్వాత కిషోర్‌బాబు సెల్ సిగ్నల్ అందాయి. ఆ వెంటనే సెక్యూరిటీ అధికారులు వెళ్ళి రావెలను కలుసుకున్నారు. త‌ర్వాతి రోజు ఈ వ్యవహారాన్ని ఉన్నతాధికారులు.. సీఎం దృష్టికి తెచ్చారు. నక్సల్స్ హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో క్యాబినెట్ మంత్రి ఎలాంటి భద్రతా లేకుండా బయటకు వెళ్ల‌డం మంచిది కాదని, ఇలాంటి విషయాన్ని ప్రభుత్వానికి అప్రతిష్ట తెస్తాయనీ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

అధికారులు చెప్పిన విష‌యాలు విన్న చంద్ర‌బాబు.. `మంత్రి రావెల‌ ఎక్కడకు వెళ్లారో తెలుసుకోవాల‌`ని చెప్పారట‌. కిషోర్‌బాబు మాత్రం త‌న‌ స్నేహితుడు రాంబాబు ఇంటికి భోజనానికి వెళ్లానని చెప్పారు. సెక్యూరిటీ లేకుండా వెళ్లాల్సిన అవ‌స‌ర‌మేంట‌నేది ఇప్పుడు ప్ర‌శ్న‌!! దీనిపై అధికారులు కూపీ లాగ‌గా అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డిందట‌,

మంత్రిని కలిసేందుకు ఆ రోజు రెండు వందలమంది వచ్చారట. వారు ఎందుకు వచ్చారో, వారితో మంత్రి ఏమి మాట్లాడారో అన్న అంశాలపై పూర్తి నివేదిక త‌యారుచేసి సీల్డ్‌ కవర్‌లో సీఎంకి అందించాయి. దీంతో అందులో ఏముందోన‌ని మంత్రితో పాటు ఇత‌ర అధికారులు ఆస‌క్తిగా ఉన్నారు! మ‌రి రావెలపై బాబు ఏ నిర్ణ‌యం తీసుకోనున్నారో!!