మల్లన్నకు పెరుగుతున్న మద్దతు

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో రెండేళ్ల తర్వాత ఓ ప్రజాఉద్యమం ఊపిరి పోసుకుంది. ఈ రెండేళ్లలో విపక్షాలు వివిధ అంశాలపై ఎన్ని ఆందోళనలు నిర్వహించినా లభించని మద్దతు, మల్లన్నసాగర్ భూసేకరణపై రైతులు చేస్తున్న ఉద్యమానికి లభించడం విశేషం. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న మెదక్ జిల్లా ఏటిగడ్డకిష్టాపూర్, పల్లెపహాడ్, వేములగట్, తొగుట గ్రామాలను ముంచేలా నిర్మించనున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం గజం భూమి కూడా ఇచ్చేది లేదన్న నాలుగు గ్రామాల రైతులకు అనుకూలంగా విపక్షాలు, జాక్ చైర్మన్ కోదండరామ్ ఉద్యమబాట పడుతున్నారు. తాజాగా ప్రభుత్వ చర్యను అడ్డుకోవాలని కోరుతూ 4 గ్రామాల రైతులు మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయడం కొత్తమలుపు తిరిగింది.

ఓ పక్క నల్లగొండ, మెదక్, నిజామామాద్ జిల్లాలలో సాగునీరు కోసం ఈ ప్రాజెక్టు నిర్మించాలని కోరుతూ తెరాస పరోక్ష ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ధర్నాలు జరుగుతుండగా, తమ భూముల జోలికి వస్తే సహించేది లేదని నాలుగు గ్రామాల ప్రజలు రోడ్డెక్కి, గ్రామాల్లోకి తెరాస నేతలను సైతం రాకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో నాలుగు గ్రామాలకు మద్దతుగా కోదండరామ్ ఆధ్వర్యంలోని జాక్, ఉస్మానియా యూనివర్శిటీ జాక్, కాంగ్రెస్, టీడీపీ రంగంలోకి దిగాయి. గత రెండేళ్లలో ఎన్ని పోరాటాలు చేసినా ఫలితం దక్కకుండా పోయిన విపక్షాలన్నింటికి తాజాగా మల్లన్నసాగర్ వారందరికీ ఒక అస్త్రం దొరికినట్టయింది.ఇప్పటికే ముంపుగ్రామ నిర్వాసితులను జాక్ చైర్మన్ కోదండరామ్ పరామర్శించి మద్దతు ప్రకటించారు. జాక్ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ‘సమైక్య రాష్ట్రంలోనే అన్యాయాలపై కొట్లాడినం. సొంత రాష్ట్రంలో ఆపలేమా? మీ వెనుక మేమున్నాం’ అని భరోసా ఇచ్చారు.

తాజాగా నిర్వాసితుల పక్షాన తాను 48 గంటల దీక్షకు దిగనున్నట్లు టిటిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఆందోళన రాజకీయంగా కొత్తమలుపు తిరిగినట్టయింది. ఈ సందర్భంగా రేవంత్ ఇచ్చిన ఆఫర్ చర్చనీయాంశమయింది. కేసీఆర్ ఫాంహౌస్‌ను ఎకరాకు రూ.10 లక్షల చొప్పున 25 కోట్లు డిడి రూపంలో ఇస్తానని, అందులో 5 ఎకరాలు కేసీఆర్ గడీల నిర్మాణానికి ఇచ్చి, మిగిలిన భూమి నిర్వాసితులకు ఇద్దామని సవాల్ చేశారు.అటు ప్రాజెక్టు నిర్మాణాన్ని తెరాస కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు వల్ల 4 జిల్లాల్లో 30 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయని, 18లక్షల ఎకరాలు కొత్తగా సాగులోకి వస్తాయని వాదిస్తోంది. తెలంగాణను సస్యశ్యామలం చేసే ఈ ప్రాజెక్టును ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని మంత్రులు ఎదురుదాడి ప్రారంభించారు. నాలుగు జిల్లాల వారితో కలసి మల్లన్నసాగర్ ప్రాజెక్టు సాధన సభకు టిఆర్‌ఎస్ ఊపిరి పోసింది. నాలుగు గ్రామాల కోసం 4వేల గ్రామాలను అన్యాయం చేస్తారా? అని సాధన సభ నేతలు ప్రశ్నించారు. నిజామాబాద్‌లో కోదండరామ్ దిష్టిబొమ్మ కూడా తగులబెట్టడం ద్వారా ఆయన్ను విపక్షాలతో జతకలిపినట్టయింది. కేంద్రం రూపొందించిన 2013నాటి భూసేకరణ చట్టం వల్ల రైతులకు నష్టమని, దానివల్ల ఎకరాకు 3 లక్షలు మించి రాదని, తాము ఇచ్చిన 123 జీఓతో 7-8 లక్షలు వస్తుందన్న వాదనకు తెరలేపారు. చివరకు నాలుగు జిల్లాలు-నాలుగు గ్రామాల మధ్య ఆందోళన, రాజకీయపోరాటంగా మారింది.