మల్లన్న సాగర్ మీద రేవంత్ ఉద్యమం

మల్లన్న సాగర్ సమస్యను ఆయుధంగా అధికారపక్షాన్ని ఇరకాటంలో పెట్టాలని టీటీడీపీ సిద్ధమవుతోంది, ముంపు బాధితుల తరుపున పోరాటం ఉధృతం చేయాలని నిర్ణయించింది. రైతుల తరపున దీక్ష చేయడానికి టీటీడీపీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారు.

మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యపై టీడీపీ ఉద్యమ బాటపట్టి చాలా రోజులైంది. ఈ నెల ఒక‌ట‌వ తేదీన తెలుగుదేశం ముఖ్య నేత‌లు మెద‌క్ జిల్లా ఏటిగ‌డ్డ కిష్టాపూర్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని బాధితుల తరుపున ఉద్యమిస్తామని హామీ ఇచ్చారు. నిర్వాసితులకు ఎక్కు వ నష్ట పరిహారం చెల్లించాలని లేదంటే..ప్రాజెక్టు డిజైన్ మార్చాల‌ని డిమాండ్ చేశారు. అయితే నిర్వాసితుల డిమాండ్లను ప్రభుత్వం ప‌ట్టించుకోక పోవ‌డంతో ఈ అంశాన్ని అస్త్రంగా మలచుకునేందుకు టీటీడీపీ నేతలు పావులు క‌దుపుతున్నారు. నిర్వాసితులకు మద్దతుగా ఈ నెల 25, 26 తేదీల్లో టీ. టీడీపీ నేత రేవంత్‌రెడ్డి నిరాహార దీక్ష చేయాలని రేవంత్ నిర్ణయించుకున్నారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వ‌ల్ల మెద‌క్ జిల్లాలో అనేక గ్రామాల ప్రజ‌లు నిర్వాసితులుగా మారే ప్రమాదం ఉంద‌ని టీడీపీ నేత‌లు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు నిర్మించి తీరుతామంటున్న ప్రభుత్వం…న‌ష్ట ప‌రిహారంలో ఎందుకు వెన‌క‌డుగు వేస్తోంద‌ని ప్రశ్నిస్తున్నారు. ప్రాజెక్టు డిజైన్ మార్చుకునే అవ‌కాశం ఉన్నా ప్రభుత్వం కావాల‌నే మొండిగా వ్యవహ‌రిస్తోంద‌ని అంటున్నారు.

మల్లన్నసాగర్ నిర్వాసితులకు 123 జీవో ప్రకారం భూ సేకరణ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే ఆ జీవో ప్రకారం భూసేకరణ చేస్తే కేవలం రూ.5లక్షలు మాత్రమే పరిహారం వస్తుందని, అలాగే భూ నిర్వాసితులకు ఇళ్లు కట్టించే హామీ సైతం ఆ జీవోలో లేనందను దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చిన అనంతరం భూసేకరణపై ముందుకు వెళ్లాలనే డిమాండ్‌తో రేవంత్ నిరాహార దీక్షకు పూనుకున్నారు. బాధితుల త‌రుపున పోరాడేందుకు ఎంత‌కైనా తెగిస్తామ‌ని గతంలోనే టీడీపీ నేతలు ప్రకటించారు. అందుకు అనుగుణంగానే టీటీడీపీ వ‌ర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి రెండురోజుల నిరాహార దీక్షకు రెడీ అవుతున్నారు. మల్లన్న సాగర్ పై ప్రభుత్వం పట్టుదలకు పోతుంటే..విపక్షాలు, ప్రజా సంఘాల ఆందోళనలతో వాతావరణం వేడెక్కుతోంది. మరి రేవంత్ దీక్ష ఎలాంటి పరిణామాల్ని సృష్టిస్తుందో వేచి చూడాలి.