మాజీ మంత్రికి కొత్త పార్టీలే గ‌తా..!

ఎంతీ సీనియ‌ర్ పొలిటీషియ‌న్ల‌కైనా ఒక్కొక్క సారి ప‌రిస్థితులు అనుకూలించే అవ‌కాశం ఉండ‌దు. ఈ విష‌యంలో కొంత వారి స్వ‌యంకృతం కావొచ్చు. లేదా కొంత టైంబ్యాడ్ కావొచ్చు. ఇప్పుడు ఇలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటున్నారు సీనియ‌ర్ పొలిటీషియ‌న్ కొణ‌తాల రామ‌కృష్ణ‌. వైఎస్ హ‌యాంలో కాంగ్రెస్‌లో ఉన్న‌ప్పుడు త‌న స్టైల్లో చ‌క్రం తిప్పిన కొణ‌తాల వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత అనూహ్య రాజ‌కీయ ప‌రిస్థితులు ఎదుర్కొన్నారు. అన‌కాప‌ల్లి నుంచి క్రియా శీల రాజ‌కీయాల్లో అడుగు పెట్టిన కొణ‌తాల త‌ర్వాత త‌న ప్ర‌భావం చూపించేందుకుఎంతో ఉత్సాహ‌ప‌డ్డారు.  ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ పార్టీ వైకాపాలోకి వెళ్లారు. అయితే, అక్క‌డి ప‌రిస్థితులు న‌చ్చ‌క పోవ‌డంతో 2014 ఎన్నిక‌ల త‌ర్వాత ఆయ‌న వైకాపాకు గుడ్‌బై చెప్పారు.

దీంతో ఆయ‌న అంద‌రి మాదిరిగానే టీడీపీ సైకిల్ ఎక్కుతార‌ని అనుకున్నారు. కానీ, టీడీపీలో ఉన్న ప‌రిస్థితులు, సీనియ‌ర్ నేత‌ల సూచ‌నల‌తో కొణ‌తాల విష‌యంలో చంద్ర‌బాబు రెడ్ జెండా చూపించారు. లేక‌పోయి ఉంటే కొణ‌తాల ఎప్పుడో టీడీపీ తీర్థం పుచ్చుకుని ఉండేవార‌న్న‌ది వాస్త‌వం. నిజానికి ఎన్నో ఏళ్లుగా పొలిటిక‌ల్ నేత‌గా ఉన్న‌ప్ప‌టికీ కొణ‌తాల‌పై ఎలాంటి ఆరోప‌ణ‌లూ రాలేదు. దీంతో టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి హోదాలో లోకేష్ కూడా కొణతాల‌ను తీసుకునేందుకు ప‌చ్చ‌జెండా ఊపారు. కానీ, 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఈయ‌న‌ను సంతృప్తి ప‌ర‌చ‌డం సాధ్యం కాద‌ని నిర్ణ‌యించుకుని.. ఆయ‌న‌ను దూరం పెట్టార‌ని తెలుస్తోంది.

ఫ‌లితంగా కొణ‌తాల ప‌రిస్థితి పార్టీలేని నేత‌గా మిగిలిపోయారు. అయితే, రేపో మాపో జ‌న‌సేనాని త‌న పార్టీని విస్త‌రిస్తార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా 2019 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ పెద్ద ఎత్తున విజృంభిస్తార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో జ‌న‌సేన పంచ‌న చేరే ఆలోచ‌న చేస్తారేమోన‌ని కొణ‌తాల అనుచ‌రులు చెప్పుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. అయితే, ప‌వ‌న్ దూకుడుని కొణ‌తాల త‌ట్టుకుని నిల‌బ‌డ‌తారా? అన్న‌ది సందేహంగా ఉంది. ఇక‌, బీజేపీతో ఈయ‌న జ‌త‌క‌ట్టే ఛాన్స్ క‌నిపించ‌డంలేదు. సో.. ఈ నేప‌థ్యంలో కొణ‌తాల పొలిటిక‌ల్ ఎంట్రీపై స‌ర్వ్ర‌తా ఆస‌క్తి నెల‌కొంది.

ఇదిలావుంటే, ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశంపై కొణ‌తాల కూడా గ‌ళం విప్పారు. హోదా వ‌స్తే.. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంద‌ని ఆయ‌న ఇటీవ‌ల మీడియా మీటింగ్‌లో కూడా చెప్పారు. ఈ క్ర‌మంలో ఆయ‌న చాయ్ పే చ‌ర్చ పేరుతో ఏపీలో వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. అన్ని చాయ్ దుకాణాల్లోనూ హోదాపై చ‌ర్చ జ‌ర‌గాల‌ని ఆయ‌న ఆకాంక్షిస్తున్నారు. మ‌రి ఈ కార్య‌క్ర‌మం తీరును బ‌ట్టి చూస్తే.. హోదాను వ్య‌తిరేకిస్తున్న టీడీపీకి వ్య‌తిరేకం కాబ‌ట్టి.. కొణ‌తాల టీడీపీలో చేరే ఛాన్స్ లేద‌ని తెలుస్తోంది.

 అదేస‌మ‌యంలో హోదాకు అనుకూల‌మే అయిన‌ప్ప‌టికీ.. వైకాపా పంచ‌న చేరే ఛాన్స్ కూడాలేద‌ని స‌మాచారం. ఇక‌, ఎటొచ్చీ.. హోదాపై త్వ‌ర‌లో యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్న జ‌న‌సేనానికి అనుకూలంగానే ఈ చాయ్ పేచ‌ర్చ‌ను కొణ‌తాల ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే.. ఆయ‌న జ‌న‌సేన‌లోకి వెళ్లే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టుగానే భావించొచ్చు. మ‌రి ఏంజ‌రుగుతుందో వేచి చూడాలి.