మార్పుకోసం జనసేన యుద్ధం.

రాజకీయాల్లో మార్పు కోసమంటూ సినీ నటుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారుగానీ, ప్రస్తుత రాజకీయాల్లో ఓ రాజకీయ పార్టీని నడపడమెంత కష్టమో ఒక్క దఫా ఎన్నికలతోనే అర్థం చేసుకున్న ఆయన విధిలేని పరిస్థితుల్లో తన పార్టీని కాంగ్రెసు పార్టీలో కలిపేశారు. కాంగ్రెసు పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారాయన. ఇప్పుడాయన సోదరుడు పవన్‌కళ్యాణ్‌ సొంతంగా పార్టీ పెట్టారు, జనసేన పార్టీకి అధినేతగా ఉన్నారు. ఈయన కూడా మార్పు నినాదంతోనే ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారట. తన ఉద్దేశ్యాల్ని ప్రజలకు వివరించేందుకు ప్రజల్ని చైతన్య పరిచేందుకు ‘మార్పు కోసం యుద్ధం’ అనే బాటను ఎంచుకున్నారు.

 ‘నేను మనం జనం’ అనే పుస్తకం రాస్తున్న పవన్‌కళ్యాణ్‌, అందులో రాజకీయంగా తన లక్ష్యాలు, రాజకీయాల్లోకి రావడం ద్వారా సమాజంలో తీసుకురాబోయే మార్పుని గురించి వివరించనున్నారని సమాచారమ్‌. ఇప్పటికే పుస్తక రచన ప్రారంభించిన పవన్‌కళ్యాణ్‌ రెండు మూడు నెలల్లోనే ఓ పెద్ద వేదిక ద్వారా ఆ పుస్తకాన్ని విడుదల చేస్తారని తెలియవస్తోంది. ఇదివరకే పవన్‌కళ్యాణ్‌ ‘ఇజం’ పేరిట ఓ పుస్తకాన్ని రచించారు. ఈసారి రచిస్తున్న ‘నేను మనం జనం – మార్పు కోసం యుద్ధం’ అనే పుస్తకం ద్వారా ఇంకా సరళంగా తన ఉద్దేశ్యాల్ని తెలియజేయనున్నారని సమాచారమ్‌.