మీడియా సెల్ సంస్కరణలతో పరకాలకు చెక్

ఆంధ్రప్ర‌దేశ్ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌లో మునుప‌టి ఉత్సాహం క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా కొత్త స‌మాచార శాఖ క‌మిష‌న‌ర్‌గా కృష్ణ మోహ‌న్ నియ‌మితులైన త‌ర్వాత ప్ర‌భాక‌ర్ పేరు అంతగా వినిపించ‌డం లేదు. దీంతో ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ అధికారాల్లో కోత విధించారా అనే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఎంతో ఉత్సాహంతో క‌నిపించిన ఆయ‌న.. ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డానికి ఇదే కార‌ణ‌మంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ‘పవర్’కు కత్తెర పడిందా? అంటే అవుననే అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. కొత్త సమాచార శాఖ కమిషనర్ గా  కృష్ణమోహన్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన  వెంటనే ఆయన సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకూ సాగుతున్న వ్యవహారంపై కూడా   కృష్ణమోహన్ తీవ్ర అసంతృప్తి చేసి..సమూల మార్పులకు శ్రీకారం చుట్టారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొంత కాలం వరకూ సీఎంకు చెందిన సమాచార‌మంతా సీఎం మీడియా సలహాదారు పేరుతో పంపేవారు. ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి చెప్పి.. సమాచార శాఖ పేరుతోనే మీడియాకు సమాచారం అందజేస్తున్నారు.

ఓటుకు నోటు కేసులో పరకాల ప్రభాకర్ చేసిన వివాదస్పద ప్రకటనలు.. పుష్కరాల సమయంలో చోటుచేసుకున్న సంఘటనలు అధికార టీడీపీ వర్గాల్లో పరకాల ప్రభాకర్ తీరుపై వ్యతిరేకతను పెంచాయి. చంద్రబాబు తన ప్రతి విదేశీ టూర్ లో పరకాల ప్రభాకర్ ను వెంట ఉంచుకోవటంతో ఆయన హవా కొనసాగుతుందనే అంతా భావించారు. అయితే కృష్ణ‌మోహ‌న్ స‌మూల మార్పుల‌కు తెర తీయ‌డంతో ప్ర‌భాక‌ర్‌.. ప‌వ‌ర్ త‌గ్గించిన‌ట్టే అనే సంకేతాలు వినిపిస్తున్నాయి.అయితే అమరావతి శంకుస్థాపనకి సంబంధించి మీడియా బాధ్యతలు కూడా పరకాలకు అప్పగించినా ఆయన ఎంత మేరకు ఈ సారి చొరవ తీసుకుంటున్నారనే అంశంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.