ముఖ్యమంత్రిగారి సతీమణి కూడానా?

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ సతీమణి కేంద్ర సర్వీసుల్లో ఉద్యోగం చేసేవారు. ఆమె తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఆమె రాజకీయాల్లోకి వచ్చే అవకాశముందంటూ గుగసగుసలు వినవస్తున్నాయ్‌. అయితే ఈ గాసిప్స్‌ని ఆమ్‌ ఆద్మీ పార్టీ వర్గాలు ఖండించేశాయి. కానీ జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన కేజ్రీవాల్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి పదవిని తన భార్యకు అప్పగించాలని భావిస్తున్నారంటూ ప్రచారమైతే యధావిదిగా కొనసాగుతోంది.

అతి త్వరలో వివిధ రాష్ట్రాల ఎన్నికలు జరగనుండడం, మూడేళ్ళలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సి ఉండటంతో ఇప్పటినుంచే జాతీయ స్థాయిలో బలపడేందుకు కేజ్రీవాల్‌ వ్యూహాలు రచిస్తున్నారట. అందులో భాగంగానే ఆమ్‌ ఆద్మీ పార్టీ ఢిల్లీ పగ్గాలు తన భార్య చేతికి ఇవ్వాలనుకుంటున్నారట. అతి త్వరలో జరగనున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల కోసమే కేజ్రీవాల్‌ ఆ ఆలోచన చేశారంటున్నారు.

కానీ కుటుంబ రాజకీయాలకు ఆమ్‌ ఆద్మీ పార్టీ వ్యతిరేకం అని ఆ పార్టీ రాజ్యాంగంలోనే రాసుకున్న విషయాన్ని విస్మరించలేం. అలాగే చెప్పడానికే నీతులు తప్ప పాటించడానికి కాదనే వాదననీ గుర్తుపెట్టుకోవాలి. ప్రధాని పదవి కోసం ప్రయత్నిస్తున్న కేజ్రీవాల్‌ గత కొంతకాలంగా నరేంద్రమోడీనే తన రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తున్నారు. దాంతో ఢిల్లీ రాజకీయాల నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు తన భార్యను కేజ్రీవాల్‌ రాజకీయాల్లోకి తీసుకొచ్చినా ఆశ్చర్యం ఉండబోదు.