మూడు పార్టీల్లో ముగ్గురు మెగా బ్ర‌ద‌ర్స్‌

టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీకి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ ఫ్యామిలీకి మెగాస్టార్ చిరంజీవితో స్టార్ట్ అయిన క్రేజ్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పీక్‌కు చేరింది. ఇప్పుడు టాలీవుడ్‌లో మెగా ఫ్యామిలీ హీరోలు ఏకంగా ఏడెనిమిది మంది ఉంటే యేడాదిలో వారు న‌టించిన సినిమాలే ఏకంగా 10 వ‌ర‌కు రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీలో కీల‌క‌మైన మెగా బ్ర‌ద‌ర్స్ ముగ్గురు రాజ‌కీయంగా ఎవ‌రి దారు వారు చూసుకోనున్నారా ?  ముగ్గురు బ్ర‌ద‌ర్స్ …మూడు పార్టీల్లో ఉంటారా ? అంటే అవున‌నే స‌మాధానాలే తాజాగా విన‌వ‌స్తున్నాయి.

ప్ర‌జారాజ్యం పార్టీ స్థాపించిన చిరు 2009 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ త‌ర‌పున పోటీచేసి పాల‌కొల్లులో సైతం ఎమ్మెల్యేగా ఓడిపోయారు. తిరుప‌తి నుంచి ఆయ‌న అసెంబ్లీలోకి అత్తెస‌రు మెజార్టీతో అడుగుపెట్టారు. ఆ త‌ర్వాత చిరు త‌న ప్ర‌జారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసి…రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌వ్వ‌డంతో పాటు కేంద్ర‌మంత్రి కూడా అయ్యారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. దీంతో చిరు టీడీపీలోకి వెళ‌తార‌ని కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి.

చిరు టీడీపీ ఎంట్రీపై లోకేష్ – చిరు మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయ‌ని..చిరు రాజ్య‌స‌భ రెన్యువ‌ల్ లేదా స్టేట్ కేబినెట్‌లో మంత్రి ప‌ద‌వి ఆఫ‌ర్ కూడా చిరుకు వ‌చ్చిన‌ట్టు ప్ర‌చారం జ‌రిగింది. చిరు టీడీపీలో వెళితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎలాగూ జ‌న‌సేన అధ్యక్షుడిగా ఉన్నారు. ప‌వ‌న్ 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం ఖ‌రారైంది. జ‌న‌సేన ప్ర‌ధాన టార్గెట్ ఏపీపైనే ఉంది. ప‌వ‌న్ కూడా ఆ ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయ‌డం ఖరారైంది.

ఇక ఇప్పుడు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు సైతం పొలిటిక‌ల్‌గా త‌న దారి తాను చూసుకునే ప‌నిలో ఉన్న‌ట్టు తెలుస్తోంది. నాగ‌బాబు చూపు బీజేపీ వైపు ఉన్న‌ట్టు వార్త‌లు ట్రెండ్ అవుతున్నాయి. నాగబాబు సడన్ గా మోడీ తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించడం రాజకీయ వర్గాల్లో సరికొత్త ఊహాగానాలకు కారణమవుతోంది. కొందరైతే వచ్చే ఎన్నికల్లో నాగబాబు బీజేపీ తరపున పోటీ చేయడం ఖాయమని చెవులు కొరుక్కుంటున్నారు.

ఇక మ‌రో టాక్ ఏంటంటే బీజేపీ నాగ‌బాబుకు కాకినాడ లోక్‌స‌భ సీటు ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. అక్కడ గెలవకపోయినా పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఢిల్లీ స్థాయిలోని బీజేపీ పెద్దలు ఆయనకు హామీ ఇచ్చినట్టు సమాచారం. అందుకే నాగ‌బాబు ప‌వ‌న్‌కు యాంటీగా మోడీ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఏపీలో కాపుల‌ను ద‌గ్గ‌ర‌కు చేర్చుకునే ప‌నిలో ఉన్న బీజేపీ కాపులు ఎక్కువుగా ఉన్న కాకినాడ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాగ‌బాబును బ‌రిలోకి దింపాల‌ని భావిస్తోంద‌ట‌. ఏదేమైనా మెగా ఫ్యామిలీలో ముగ్గురు మెగా బ్ర‌ద‌ర్స్ చూపులు రాజ‌కీయంగా మూడు పార్టీల వైపు ఉండ‌డం విశేషంగానే చెప్పుకోవాలి.