రజని లోకల్ కాదు అంటున్న స్టార్ హీరో.

త‌మిళ‌నాడు రాజ‌కీయాలు దాదాపు ఇప్పుడు స్త‌బ్ద‌త‌లో ఉన్నాయి. మాజీ సీఎం జ‌య ల‌లిత మృతి. ఆమె స్థానంలో ఆయ‌న అత్యంత విశ్వాస‌పాత్రుడు ప‌న్నీర్ సెల్వం.. గ‌ద్దెనెక్క‌డం.. తెలిసిందే. అయితే, ప‌న్నీర్ సెల్వం ఆశించినంత దూకుడుగా పాల‌న‌ను ప్రారంభించ‌లేక‌పోవ‌డం, ప్ర‌స్తుతం కూడా ఆయ‌న ఆశించిన విధంగా పాల‌న చేయ‌లేక‌పోతుండ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ‌న‌డుస్తోంది. నిజానికి ఇప్పుడు రాష్ట్రంలో జ‌య అంత స‌మ‌ర్ధంగా పాల‌న సాగ‌డం లేద‌నే అంద‌రూ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స‌రైన టైంలో స‌రైన నేత అన్న‌ట్టుగా త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ పొలిటిక‌ల్‌గా రంగంలోకి దిగాల‌ని ఆయ‌న అభిమానులు కోరుతున్నారు.

నిజానికి ర‌జ‌నీని రాజ‌కీయాల్లోకి రావాల‌ని  అభిమానులు కోరుకోవ‌డం ఇప్పుడు కొత్త‌కాదు. ఎన్నో ఏళ్లుగా ఉన్న‌దే. అయితే, అప్ప‌టికీ.. ఇప్ప‌టికీ చాలా తేడా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో స‌రైన నేత లేడ‌నే అభిప్రాయం జ‌నాల్లో ఎక్కువ‌గా ఉంది. ఒక ప‌క్క అమ్మ మృతి చెంద‌డం, విప‌క్షంలో ఉన్న డీఎంకే అధినేత క‌రుణానిధి కూడా కురువృద్ధుడు కావ‌డం దీంతో ఆయ‌న త‌న పార్టీని దాదాపు చిన్న‌కొడుకు స్టాలిన్ కి అప్ప‌గించ‌డం ఆయ‌న‌కు మేయ‌ర్‌గా ప‌నిచేసిన అనుభ‌వం త‌ప్ప పార్టీని పూర్తిగా న‌డిపించే స‌త్తాలేద‌ని ఎక్కువ మంది నమ్ముతుండ‌డంతో ప్ర‌స్తుతం ఓ గ్యాప్ వ‌చ్చింద‌ని అంద‌రూ భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ర‌జ‌నీ రాజ‌కీయంగా ఎంట్రీ ఇస్తే.. మంచి మైలేజీ వ‌స్తుంద‌ని ర‌జ‌నీ అభిమానులు పెద్ద ఎత్తున పిలుపునిస్తున్నారు. అయితే, ఇదే స‌మ‌యంలో ర‌జ‌నీ రాజ‌కీయాల్లోకి రాకూడ‌దంటూ మ‌రో వ‌ర్గం రోడ్లెక్క‌డం అత్యంత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌రిణామంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా సినీ రంగం నుంచి రాజ‌కీయ అరంగేట్రం చేసిన శ‌ర‌త్ కుమార్ వంటి వారే ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. దీంతో అస‌లు ర‌జ‌నీ ఎంట్రీపై ఎందుకు వీరు ఇంత రాద్దాంతం చేస్తున్నార‌ని ఆలోచిస్తే.. ఆయ‌న ప‌క్కా నాన్‌లోక‌ల్ అనే విష‌యం తెలుస్తోంది.

ర‌జ‌నీ వాస్త‌వానికి క‌ర్ణాట‌క‌కు చెందిన వ్య‌క్తి. అక్క‌డి ఆర్‌టీసీలో కండెక్ట‌ర్‌గా కూడా ఉద్యోగం చేశాడు. అయితే ల‌క్కీగా మూవీ ఇండ‌స్ట్రీలోకి రావ‌డం చెన్నైలో స్థిర‌ప‌డ‌డం వంటివి జ‌రిగాయి. ఇప్పుడు ఇదే విష‌యాన్ని శ‌ర‌త్‌కుమార్ లాంటి ఒక‌రిద్ద‌రు లేవ‌నెత్తుతున్నారు. ప‌క్కా నాన్‌లోక‌ల్ అయిన ర‌జ‌నీ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తే.. తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని నేరుగా హెచ్చ‌రిస్తున్నాడు. అయితే, ఇటీవ‌ల మృతి చెందిన జ‌య కూడా నాన్‌లోక‌లే. అయినా కూడా త‌మిళులు ఆమెను అమ్మ‌ను మించిన అమ్మ‌గా చూసుకున్నారు.

మ‌రి జ‌య విష‌యంలో రాని అడ్డంకులు ఇప్పుడు ర‌జ‌నీ విష‌యంలో ఎందుకు వ‌స్తున్నాయో అర్ధం కావ‌డం లేద‌ని కొంద‌రు విశ్లేష‌కులు చెబుతున్నారు. మ‌రి భ‌విష్య‌త్తులో ప‌రిస్థితి ఎలా దారితీస్తుందో చూడాలి. ఇక్క‌డ ఆస‌క్తిక‌ర ప‌రిణామం ఏంటంటే.. ర‌జ‌నీ ముందు రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు అంత‌గా ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని!! మ‌రి ఏం జ‌రుగుతుందో భ‌విష్య‌త్తు తేల్చాలి.