రోజా రాజీ – కథ అయిపోలేదు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో రోజా రీ ఎంట్రీ ఇవ్వడానికి మార్గం సుగమం అయినట్లుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రోజా దురుసు ప్రవర్తన కారణంగా ఆమెను ఏడాదిపాటు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారు. కొన్నాళ్ళు బెట్టు చేసినా, తిరిగి అసెంబ్లీలోకి వెళ్ళేందుకు రోజా క్షమాపణ చెప్పక తప్పలేదు. క్షమాపణను రాత పూర్వకంగా ఆమె తెలియజేసినప్పటికీ, అసెంబ్లీకి ఆమెతో ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పించాలని అధికార పార్టీ అనుకుంటోందట. ముఖ్యమంత్రి చంద్రబాబు మీదా, టిడిపి మహిళా ఎమ్మెల్యే అనితపైనా వ్యక్తిగత దూషణలకు దిగిన రోజా, నైతికంగా చాలా పెద్ద తప్పే చేశారు.

‘నేను తప్పు చేయలేదు’ అని రోజా బుకాయించినప్పటికీ ఆమె అసెంబ్లీలో వ్యవహరించిన తీరుని ప్రపంచమంతా చూసింది. ఇంకో వైపున రోజా న్యాయస్థానాల్ని ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోవడంతోనే ఆమె క్షమాపణ చెప్పడానికి ముందుకు వచ్చినట్లు తెలియవస్తోంది. రేపటినుంచి మూడు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు హాజరయ్యేందుకు రోజా శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రేపు ఉదయమే రోజా క్షమాపణ లేఖ సభ ముందుకు రావొచ్చు. సభ రోజా క్షమాపణను ఆమోదిస్తే, ఆమె అసెంబ్లీలోకి రావడానికి వీలుంటుంది, అలాగే ఆమెపై సస్పెన్షన్‌ తొలగిపోయేందుకు ఆస్కారముంటుంది.