విజయవాడ మెట్రోకు కేంద్రం గండి

ఏపీలో మెట్రో రైలు ప్రాజెక్టుపై నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి! మూడేళ్లు గ‌డిచినా.. ఇప్ప‌టికీ మెట్రో ప్రాజెక్టు ప‌నుల్లో క‌ద‌లిక లేక‌పోవ‌డం ఇప్పుడు అనేక సందేహాల‌కు తావిస్తోంది. విభజ‌న త‌ర్వాత న‌వ్యాంధ్ర‌లో విజ‌య‌వాడ‌కు మెట్రోను కేటాయిస్తూ కేంద్రం.. అనేక ప్ర‌క‌ట‌న‌లు జారీచేసింది. అందుకు అనుగుణంగానే విజ‌య‌వాడ‌లో మెట్రో సాధ్యా సాధ్యాల‌పై ఇప్ప‌టికే నివేదిక కూడా రూపొందించింది. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణ‌యంతో ప్ర‌స్తుతం విజ‌య‌వాడ‌లో మెట్రో రైలు క‌ల‌గానే మిగిలిపోనుంది.

విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఏపీకి కేంద్రం అనేక వ‌రాల‌ను ప్ర‌క‌టించింది. వాటిలో ఆచ‌ర‌ణ‌కు నోచుకున్నవి మాత్రం.. వేళ్ల‌పైనే లెక్క‌పెట్ట‌చ్చు! ఈ ప్ర‌కటించిన వ‌రాల్లో మెట్రో రైలు కూడా ఒక‌టి! విశాఖ, విజయవాడలో మెట్రో రైలు పరుగులుపెడుతుంద‌ని కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఆర్భాటంగా ప్ర‌క‌టించాయి. ఇందుకు రెండు సంస్థలు కూడా ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. ఒకేసారి రెండు మెట్రోలు ఏర్పాటుచేయ‌డం సాధ్యం కాద‌ని భావించిన ప్ర‌భుత్వం.. విశాఖ మెట్రోను  పక్కనపెట్టింది. అలాగే న‌వ్యాంధ్ర ప‌రిపాలన కేంద్ర‌మైన‌ విజ‌య‌వాడ‌లో మెట్రో ప్రాజెక్టు ప్రారంభించేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. ప‌నుల్లో మాత్రం ఏమాత్రం క‌ద‌లిక లేదు.

విజయవాడ మెట్రో ప‌నుల‌పై ముందుకు వెళ్లే జాడ కనిపించడం లేదు. ఇదే స‌మ‌యంలో విజయవాడ-అమరావతి నడుమ మెట్రో నిర్మించేకన్నా స్పీడ్ రైలు నిర్మిస్తే వ్య‌యం త‌గ్గుతుంద‌న్న వార్తలు తెరపైకి వచ్చాయి. దీంతో ప్ర‌జ‌ల్లో కొన్ని అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి! అందుకు అనుగుణంగానే మెట్రో రైలు అంశం తెర వెన‌క్కు చేరిపోయింది. ఇదే స‌మ‌యంలో కేంద్రం తీసుకుంటున్న నిర్ణ‌యాలు కూడా మెట్రో ప‌నుల‌కు అడ్డంకిగా మారాయి! మెట్రో వ్య‌యంలో రాష్ట్ర ప్రభుత్వం 50శాతం, కేంద్ర ప్రభుత్వం 20శాతంతో పాటు మిగిలిన వాటాను ప్రపంచ బ్యాంకు వంటి బ్యాంకర్లు భరించాల్సి ఉంటుంది. కానీ ఇకపై ప్రభుత్వాల భాగస్వామ్యం కాకుండా, పూర్తిగా ప్రైవేటు వారి ఆధీనంలోనే మెట్రోలు నిర్మాణం అవుతాయని కేంద్రం చెబుతోంది. ఈ లెక్కన కొత్త మెట్రోలకు కొత్త గైడ్ లైన్స్ అవసరం.

ఆ లెక్కన విజ‌య‌వాడ‌ మెట్రో సాకారం కావాలంటే మళ్లీ మొదట్నించీ అన్నీ మొదలుపెట్టాల్సిందే! విజయవాడ  ప్రధాన రోడ్లు, కోట్ల విలువ చేసే కృష్ణా, గుంటూరు భూముల్లోంచి మెట్రో వెళ్లాలి అంటే భూసేకరణకే కోట్లు ఖర్చు చేయాలి. అంతటి ఖర్చుకు ప్రయివేటుజనాలు ముందుకు రావాలి.