విశ్వసనీయవర్గాల సమాచారం … టీడీపీలోకి వంగవీటి..?

స‌మైక్య రాష్ట్రంలో వంగ‌వీటి రంగా పేరు తెలియ‌ని వారు ఉండ‌రు. ఎన్టీఆర్ ప్ర‌భుత్వం సైతం ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డానికి కార‌ణ‌మైన ఈ ఫ్యామిలీకి కాంగ్రెస్‌లో ఎంతో పేరుంది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన వంగ‌వీటి రంగ హ‌త్య త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓడిపోయిన సంగ‌తి తెలిసిందే. రంగ హ‌త్య త‌ర్వాత ఆయ‌న భార్య ర‌త్న‌కుమారి రెండుసార్లు అదే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

2004 ఎన్నిక‌ల్లో దివంగ‌త మాజీ సీఎం వైఎస్‌.రాజ‌శేఖ‌ర్‌రెడ్డి అండ‌దండ‌ల‌తో కాంగ్రెస్ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలిచారు రంగా త‌న‌యుడు రాధా. ఆ త‌ర్వాత 2009లో ప్రజారాజ్యం నుంచి 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన రాధా కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు వైసీపీ న‌గ‌ర అధ్య‌క్షుడిగా ఉన్నారు. రాధా పార్టీ ప‌టిష్ట‌త‌కోసం స‌రిగా కృషి చేయ‌డం లేద‌ని భావించిన జ‌గ‌న్ కొద్ది రోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే వెల్లంప‌ల్లి శ్రీనివాస్‌కు న‌గ‌ర పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించారు.

అప్ప‌టి నుంచి రాధా జ‌గ‌న్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తాజాగా వెలంపల్లి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా ఆయ‌న హాజ‌రు కాలేదు. వెలంపల్లికి బాధ్యతలు అప్పగించడం పట్ల రాధా విముఖంగా ఉన్నారని తెలుస్తోంది. అయితే కార్యక్రమానికి హాజరై టీడీపీపై విమర్శలు చేసిన ఏ ఒక్క నాయకుడూ రాధా గైర్హాజరీపై స్పందించకపోవడం గమనార్హం.

ఇక గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీతో పాటు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని త‌దిత‌రులు రాధాను టీడీపీలోకి తీసుకు వ‌చ్చేందుకు ట్రై చేస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. మ‌రి వీరి ప్ర‌య‌త్నాలు ఎంత వ‌ర‌కు నెర‌వేర‌తాయో చూడాలి.