వైకాపాలో ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటు ఎవరిదో..!

వైకాపాలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేడి సెగ‌లు పుట్టిస్తోంది! ఒక రొట్టె వంద జీవులు అన్న‌టైపులో ఈ పార్టీకి శాస‌న స‌భ్యుల లెక్క ప్ర‌కారం ఒక ఎమ్మెల్సీ సీటు ల‌భించ‌నుంది. దీంతో ఈ ఒక్క సీటు కోసం దాదాపు 10 మందిపైగా సీనియ‌ర్ మోస్ట్ లీడ‌ర్లు కాచుకుని ఉన్నారు. దీంతో వీరి ఎంపిక ఇప్పుడు వైకాపా అధినేత జ‌గ‌న్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తోంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతమున్న ప‌రిస్థితిలో వైకాపా నేత‌లు చాలా మంది ఖాళీగానే ఉన్నారు. దీంతో వీరిలో ఎక్కువ మంది ఈ సీటు కోసం క్యూక‌డుతున్న‌ట్టు స‌మాచారం.

నిజానికి పార్టీ అధికార ప్ర‌తినిధులుగా ఉన్న అంబ‌టి రాంబాబు, వాసిరెడ్డి ప‌ద్మ‌ల నుంచి కాంగ్రెస్ నుంచి వైకాపాలోకి జంప్ చేసిన ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు వ‌ర‌కు భారీ సంఖ్య‌లో ఈ ఎమ్మెల్సీ సీటుపై క‌న్నేశారు. దీనికితోడు ఆయా నేత‌లు వైకాపా తీర్థం పుచ్చుకుంటున్న స‌మ‌యంలో జ‌గ‌న్ నుంచి ఈ మేర‌కు హామీ కూడా పొందార‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే ఉన్న ఒక్క సీటు కోసం నేత‌లు జ‌గ‌న్‌పై విప‌రీత‌మైన ఆశ‌లు పెట్టుకున్నార‌ని తెలుస్తోంది. వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌రో నెల రోజుల్లో ఏపీ మండ‌లికి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. వైకాపాకి ఎమ్మెల్యేల కోటా కింద ఒక సీటు వ‌స్తోంది.

అయితే, దీని కోసం.. ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారథి, వాసిరెడ్డి పద్మ, అంబటి రాంబాబు,  భూమన కరుణాకర్ రెడ్డి, జ‌గ‌న్ స‌న్నిహితుడు బాలినేని శ్రీనివాస్ పేర్లు చర్చల్లో నలుగుతున్నాయి. వీరిలో ధర్మానకు సీటు ఇస్తే ఉత్తరాంధ్రలో బీసీ వెలమల్లో పట్టుపెరుగుతుందని అంటున్నారు. బాలినేనికి గతంలోనే ఎమ్మెల్సీ సీటుపై హామీ ఇచ్చారని ఆయనకు సీటు ఇస్తే ప్రకాశంలో పార్టీ బలపడుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. మ‌రోప‌క్క‌ కరుణాకర్ రెడ్డినీ తీసేయ‌లేమ‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి. గుంటూరుకు చెందిన అంబటికి ఈ ద‌ఫా న్యాయం చేస్తార‌ని ఆయ‌న వ‌ర్గం భావిస్తోంది.

కొలుసు పార్థసారథికి ఇవ్వ‌డం వ‌ల్ల ఆయ‌న సామాజిక వ‌ర్గం యాద‌వులు పార్టీకి అండ‌గా నిలుస్తార‌ని కొంద‌రు  వైపు ఆకర్షితులవుతారన్న వాదన వినిపిస్తోంది. కాగా అదే జిల్లాకు చెందిన అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మకు ఈసారికి కచ్చితంగా ఎమ్మె ల్సీ సీటు దక్కవచ్చంటున్నారు. మ‌రోప‌క్క బాలినేనికి గతంలోనే జగన్ హామీ ఇచ్చారనే టాక్ వ‌స్తోంది. ఈ ద‌ఫా బాలినేనికి ఇవ్వకపోతే ఆయ‌న పార్టీ ఫిరాయించే అక‌వాశం ఉంద‌నేది విశ్లేష‌కుల మాట‌. అయితే గతంలో కాపులకు అవకాశం ఇచ్చినందున ఈసారి బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ కూడా పార్టీలో వినిపిస్తోంది.  ఇలా… ప్ర‌తి ఒక్క‌రూ ఎమ్మెల్సీ సీటు కోసం ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్నారు. మ‌రి జ‌గ‌న్ ఎవ‌రికి ఈ సీటు క‌ట్ట‌బెడ‌తారో చూడాలి.