వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి

ఎమ్మెల్సీ ఎన్నిక‌లు టీడీపీలో అసంతృప్తి సెగ‌లు రేపుతున్నాయి. ఎన్నో యేళ్ల నుంచి పార్టీని న‌మ్ముకుని ఉన్నాం… ఎన్నోసార్లు త్యాగాలు చేశాం…అయినా పార్టీ త‌మ‌కు న్యాయం చేయ‌లేద‌ని వారంతా మండిప‌డుతున్నారు. వారిలో కొంద‌రు త‌మ తీవ్ర అసంతృప్తిని ఓపెన్‌గానే వ్య‌క్త‌ప‌రిస్తే మ‌రికొంద‌రు మాత్రం పార్టీకే గుడ్ బై చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఏపీలో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక సీనియ‌ర్ల‌లోను, ఆశావాహుల్లోను అసంతృప్తి సెగ‌లు రేపుతోంది. తాజాగా అసెంబ్లీ స‌మావేశాల వేళ డిప్యూటీ సీఎం కేఈ.కృష్ణ‌మూర్తి త‌న త‌మ్ముడు కేఈ.ప్ర‌భాక‌ర్‌కు ఎమ్మెల్సీ రాక‌పోవ‌డంపై ఓపెన్‌గానే చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. ప్ర‌తిసారి ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ప్పుడ‌ల్లా త‌న త‌మ్ముడు ప్ర‌భాక‌ర్‌కు ఏం చెప్పుకోలేక బాధ‌ప‌డుతున్నాన‌ని ఆయ‌న వాపోయారు. ఇక రాయ‌ల‌సీమ‌లో బీసీల‌కు ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వ‌క‌పోవ‌డాన్ని కూడా ఆయ‌న త‌ప్పుప‌ట్టారు.

ఇక గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి జేఆర్‌.పుష్ప‌రాజ్ ఏకంగా పార్డీ వీడే నిర్ణ‌యానికే వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. చంద్రబాబు పదేపదే అన్యాయం చేస్తుండడంతో ఇక ఆయన బుజ్జగించినా పార్టీలో ఉండకూడదని ఆయ‌న డిసైడ్ అయిపోయాడ‌ట‌. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన పుష్ప‌రాజ్‌కు 2009, 2014 ఎన్నిక‌ల్లో టిక్కెట్టు దొర‌క‌లేదు. గ‌తంలో రాజ్య‌స‌భ‌కు వెళ్లేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్పుడు చంద్ర‌బాబు ఆయ‌న్ను ఎమ్మెల్సీ ఇస్తాన‌ని బుజ్జ‌గించిన‌ట్టు స‌మాచారం.

ఇక ఇప్పుడు ఆయ‌న‌కు బ‌దులుగా గ‌తంలో ఆయ‌న మీద గెలిచిన‌, ఇటీవ‌ల టీడీపీలోకి వ‌చ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్య‌వ‌ర‌ప్ర‌సాద్‌కు బాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇది పుష్ప‌రాజ్‌కు బాగా మంట‌పుట్టించింది. దీంతో త‌న రాజ‌కీయ జీవితానికి టీడీపీలో ఫుల్‌స్టాప్ ప‌డిపోయేలా ఉంద‌ని భావిస్తోన్న ఆయ‌న వైసీపీలోకి జంప్ చేసి తాడికొండ ఎమ్మెల్యే సీటు ఆశిస్తున్న‌ట్టు గుంటూరు జిల్లాలో ప్ర‌చారం జోరుగా సాగుతోంది. త్వ‌ర‌లోనే పుష్ప‌రాజ్ త‌న పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్‌పై క్లారిటీ ఇస్తార‌ని స‌మాచారం.