వైసీపీలోకి మంచు ఫ్యామిలీ ఎంట్రీ..!ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌పై క‌న్ను..!

టాలీవుడ్‌లో మంచు ఫ్యామిలీకి స‌ప‌రేట్ క్రేజ్ ఉంది. విల‌క్ష‌ణ న‌టుడు మోహ‌న్‌బాబు రూటే ఓ స‌ప‌రేటుగా ఉంటుంది. మోహ‌న్‌బాబుకు ఇటు సినిమా రంగంతో పాటు అటు రాజ‌కీయ రంగంతోను ఎంతో అనుబంధం ఉంది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీతోను ఆయ‌న‌కు చాలా ద‌గ్గ‌రి రిలేష‌న్ ఉంది. ఏపీ ప్ర‌స్తుతం సీఎం చంద్ర‌బాబు మోహ‌న్‌బాబుకు వ‌రుస‌కు మేన‌త్త కొడుకు అవుతాడు. ఇక విపక్ష వైసీపీ అధినేత జ‌గ‌న్ అయితే అల్లుడు వ‌రుస అవుతాడు.

గ‌తంలో మోహ‌న్‌బాబు ఎన్టీఆర్ స‌పోర్ట్‌తో టీడీపీ నుంచి రాజ్య‌స‌భ‌కు కూడా ఎంపిక‌య్యాడు. ఆ త‌ర్వాత చంద్ర‌బాబుతో రాజ‌కీయంగా వ‌చ్చిన గ్యాప్‌తో టీడీపీకి దూరమై రాజ‌కీయాల‌కు ఎడ‌బాటుతో ఉంటున్నారు. ఇక జ‌గ‌న్‌తో మోహ‌న్‌బాబు బంధుత్వం విష‌యానికి వ‌స్తే జగన్ బాబాయి సుధీకర్ రెడ్డి కుమార్తె వెరోనికా రెడ్డిని మోహ‌న్‌బాబు పెద్ద కుమారుడు విష్ణు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ప్ర‌స్తుతం కొద్ది రోజులుగా రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటోన్న మోహ‌న్‌బాబు ఇప్పుడు పాలిటిక్స్‌లో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోన్న‌ట్టు తెలుస్తోంది. త‌న కుమార్తె మంచు ల‌క్ష్మిని వైసీపీ నుంచి ఎమ్మెల్యే బ‌రిలో దించేందుకు ఆయ‌న పావులు క‌దుపుతున్న‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌లు వినిపిస్తున్నాయి. త‌న కుమార్తె కోసం మోహ‌న్‌బాబు త‌న సొంత జిల్లా చిత్తూరులోని చంద్ర‌గిరి లేదా శ్రీకాళ‌హ‌స్తి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏదో ఒక నియోజ‌క‌వ‌ర్గం ఇవ్వాల‌ని జ‌గ‌న్ ముందు కండీష‌న్ పెట్టిన‌ట్టు తెలుస్తోంది.

చంద్ర‌గిరి మోహ‌న్‌బాబుకు సొంత నియోజ‌క‌వ‌ర్గం. అక్క‌డ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి ఉన్నారు. ఇక శ్రీకాళ‌హ‌స్తి నుంచి మంత్రి బొజ్జ‌ల ప్రాథినిత్యం వ‌హిస్తున్నారు. ఇక్క‌డ వైసీపీ ఇన్‌చార్జ్‌గా మ‌ధుసూద‌న్‌రెడ్డి ఉన్నారు. ఆయ‌న కూడా బ‌ల‌మైన అభ్య‌ర్థే. మ‌రి జ‌గ‌న్ మోహ‌న్‌బాబు కోసం వాళ్ల‌ను త‌ప్పించే సాహ‌సం చేస్తారా ? లేదా ఇత‌ర స‌ర్దుబాట్లు చేస్తారా ? అన్న‌ది చూడాలి. మ‌రి ఫైన‌ల్‌గా మంచు ల‌క్ష్మి పొలిటిక‌ల్ ఎంట్రీ ఎలా ఉంటుంది ? ఈ వార్త‌లు ? ఎలా ట‌ర్న్ అవుతాయో చూడాలి.